HUDA Complex | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కొత్తపేట హుడా కాంప్లెక్స్… అత్యంత రద్దీ, వ్యాపారపరంగా అత్యంత డిమాండ్ ఉన్న కూడలికి ఆనుకున్న ప్రదేశం. అలాంటిచోట హెచ్ఎండీఏకు ఒకటీ, అరా కాదు… ఏకంగా 4,311 చదరపు అడుగుల స్థలం ఉంది. అక్కడున్న పాత వ్యాపార సముదాయ భవనాన్ని ఇటీవల హెచ్ఎండీఏ కూల్చివేసింది. దశాబ్దాలుగా దుకాణాల్లో ఉండే వారిని కోర్టు ఆదేశానుసారం ఖాళీ చేయించి కూల్చివేత చేపట్టింది. మరి… ఇంత కీలకమైన స్థలాన్ని హెచ్ఎండీఏ ఏవిధంగా వినియోగించుకోనుంది?! అనే ఆసక్తి నెలకొని ఉన్న సమయంలోనే ఓ వీఐపీ ఆ స్థలాన్ని పరిశీలించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
32 దుకాణాలు..
కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్ అంటే బహుశా నగరంలో తెలియనివారు ఉండరు. 1981 నుంచి ఎగువనున్న రెండు అంతస్తులను రంగారెడ్డి జిల్లా కోర్టుకు లీజు ప్రాతిపదికన ఇచ్చారు. జిల్లా కోర్టుతో పాటు అనుబంధంగా అనేక కోర్టులు ఉండటంతో దిగువన ఉన్న దుకాణాలకు భారీఎత్తున డిమాండు ఉండేది. అలా 32 దుకాణాలను కూడా హుడా అద్దె ప్రాతిపదికన ఇచ్చింది. 2008లో ఇప్పుడు కొనసాగుతున్న రంగారెడ్డి కోర్టు కొత్త భవనం సిద్ధమవ్వడంతో జిల్లా, అనుబంధ కోర్టులన్నీ అక్కడికి తరలిపోయాయి. అప్పటి నుంచి పైనున్న రెండు అంతస్తులు ఖాళీగానే ఉన్నాయి.
అప్పట్లోనే బడా నేత కన్ను…
రంగారెడ్డి జిల్లా కోర్టు కొత్త భవనానికి తరలిపోయిన తర్వాత ఆ స్థలంపై ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన సినీ, పారిశ్రామిక, రాజకీయ రంగ ప్రముఖుడు ఒకరి కన్ను దానిపై పడింది.ఏదో ఒక పద్ధతిలో దానిని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అప్పటి హుడా అధికారులు కిరాయికి ఉన్న 32 దుకాణదారులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా.. వారంతా ఒక యూనియన్‌గా ఏర్పడి కోర్టును ఆశ్రయించారు. కాగా ఆ వ్యాపార సముదాయ భవనం శిథిలావస్థకు చేరుకుందని, కూల్చకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు కోర్టు దృష్టికి తీసుకుపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయస్థానం కూల్చివేతకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఈ నెల 19న ఆ భవన సముదాయాన్ని కూల్చివేశారు.
సదరు వీఐపీ పరిశీలనతో…
హుడా కాంప్లెక్స్ భవన సముదాయాన్ని కూల్చివేసిన మరుసటి రోజే సుమారు ఎకరం వరకు ఉన్న ఆ స్థలాన్ని ఒక రాజకీయ వీఐపీ ఒకరు పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ స్థలంపై సదరు వీఐపీ కన్నేసినట్లుగా ఖాళీ చేసిన దుకాణదారులతో పాటు స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.