Ramanthapur Pedda Cheruvu | సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రామాంతాపూర్ పెద్ద చెరువు హద్దుల వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్స్ విభాగానికి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవ్వగా, దీనిపై విచారణ జరిగింది. రెండు దశాబ్దాలుగా రామాంతాపూర్ పెద్ద చెరువు కబ్జాలు, ఆక్రమణలతో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కుచించుకుపోయిందన్నారు. ఇప్పటికీ స్థానికులు చెత్తాచెదారం నింపడంతో కబ్జాలు నిత్యకృత్యంగా మారడంతో… హద్దుల నిర్ధారణ జరగాలన్నారు.
2016లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి.. 30 ఎకరాల మేర విస్తరించి ఉందని.. ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఫైనల్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని హైకోర్టుకు వివరించారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ లేక్స్ విభాగం అధికారులు తక్షణమే పెద్ద చెరువు హద్దులను నిర్ధారించాలని, చెరువు ఎఫ్టీఎల్ 30 ఎకరాలు ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక స్థానికుల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
మహానగరంలో చెరువుల హద్దులు నిర్ధారించడంలో హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నగరంలో 3వేలకు పైగా చెరువులు ఉన్నా… సగం జలవనరులకు కూడా ఇప్పటివరకు హద్దులను నిర్ధారించలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉండగా.. శాఖల మధ్య సమన్వయం లోపం ప్రధానమని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ ఇచ్చే చెరువుల మ్యాపులు అందుబాటులో లేకపోవడంతోనే నోటిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా గతంలోనే పలు చెరువుల పరీవాహక ప్రాంతాల్లో కబ్జాలు, ఆక్రమణలు, నిర్మాణాలతో నిండిపోవడంతో.. హద్దుల నిర్ధారణ సాధ్యం కాదని, క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే నెపంతో.. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణపై అధికారులు దృష్టి పెట్టలేదు. కానీ ప్రస్తుతం చెరువుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేయడంతో.. నిర్మాణదారులు ముందుగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో హద్దుల విషయంలో తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు. నగరంలో పలు చెరువుల విషయంలో ఇదే తరహాలో కోర్టులు ఆదేశిస్తే తప్ప.. అధికారులు కదలడం లేదు.