సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హుస్సేన్‌సాగర్ జలాల శుద్ధి కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. శుద్ధి చేసే ప్రక్రియకు అవసరమైన డిజైన్ రూపొందించడం, ఆధునిక విధానాల్లో బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించే బాధ్యతలను అర్హత కలిగిన సంస్థలకు అప్పగించనున్నారు. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ జలాలు మురికికూపంగా మారడంతో వేసవిలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు బయో రెమిడియేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాచు పేరుకుపోయి దుర్వాసన రాకుండా చూడాలి. అదే సమయంలో సాగర్ జలాలను మురికి కూపంగా మారకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది.
ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఒకే దశలో మూడు అంశాలను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా టెండర్లో పాల్గొనే సంస్థకు అర్హత ఉందా లేదా? సాంకేతికంగా ఎలాంటి విధానాలు అమలు చేస్తారు ? ఆర్థికంగా ఆయా సంస్థలు ఈ ప్రక్రియ చేపట్టేందుకు సరిపోతాయా.. లేదా ? వంటి విషయాలను అధికారులు పరిశీలించి, ఎంపిక చేస్తారు. హుస్సేన్‌సాగర్ శుద్ధికి 6 నెలల పాటు నిర్వహించే బయో రెమిడియేషన్ ప్రక్రియ కోసం సుమారు రూ.1.75 కోట్లను వెచ్చించనున్నారు.
17న ప్రీ బిడ్ మీటింగ్..
టెండర్ ప్రకియను పూర్తి చేసేందుకు ఈనెల 17న ప్రీ బిడ్ మీటింగ్‌ను అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్సులోని హెచ్ఎండీఏ కార్యాలయంలోని 7వ అంతస్థులో నిర్వహిస్తున్నారు. ఈ టెండర్‌కు సంబంధించిన సమాచారం కోసం అర్హులైన సంస్థలు ఈమెయిల్ superintendingengineerhmda@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిపాదనలు అందజేసేందుకు చివరి రోజు ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉంటుందని, నియమనిబంధనలకు లోబడి టెండర్లలో పాల్గొన్న సంస్థలను ఎంపిక చేయబడుతుందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సూపరింటెండెంట్ ఇంజినీర్-1 సీహెచ్.పరంజ్యోతిని సంప్రదించాలని తెలిపారు.