సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో అనుమతుల జారీలో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా… పనితీరులో మార్పు రావడం లేదు. కానీ గతేడాది కంటే పనితీరు మెరుగుపడిందని, వేగంగా అనుమతులను జారీ చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు ప్రకటనలు జారీ చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. పది రోజుల నిర్ణీత గడువులోగా అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఇటీవలే ప్లానింగ్ విభాగానికి ఉన్నతాధికారులు డెడ్ లైన్ విధించారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులే ఉన్నాయని పలువురు దరఖాస్తుదారులు చెబుతున్నారు.
సాయంత్రం 3 గంటల తర్వాత హెచ్ఎండీఏ కార్యాలయంలో దరఖాస్తుదారులతో నిండిపోతుండగా, కుప్పలుగా పేరుకుపోతున్న దరఖాస్తులకు ఇదే నిదర్శనంగా నిలుస్తున్నది. ఓ వైపు టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తులను తీసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిశీలన, ఎన్ఓసీ, షార్ట్ ఫాల్స్ కారణంగా 10రోజుల్లో అనుమతులు జారీ చేయాలనే లక్ష్యాన్ని హెచ్ఎండీఏ చేరుకోవడం లేదు. ముఖ్యంగా హైడ్రా తర్వాత నగరంలో దరఖాస్తులను భూతద్ధంలో పెట్టి చేస్తున్నారు. దీంతో అనివార్యంగానే దరఖాస్తుల పరిశీలన జాప్యం జరుగుతున్నదని ప్లానింగ్ విభాగం సిబ్బంది పేర్కొంటున్నారు. కొన్ని సాంకేతికత కారణాలతోనే అనుమతుల మంజూరులో జరుగుతున్న ఆలస్యానికి మాత్రం సంబంధిత అధికారులు స్పందించడం లేదు.
గతంలో నగర పౌరులు సంబంధిత దరఖాస్తుల స్టేటస్ తెలుసుకునే వీలు ఉండగా, ఇప్పుడు సిటిజన్ సెర్చ్ ఆప్షన్లో కేవలం పాత, పెండింగ్ ఫైళ్లు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. నెలవారీగా దరఖాస్తులను చూసుకునే వీలు లేకపోవడంతో… దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్లో నెలవారీగా అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పొందుపరచాలని, పారదర్శకంగా హెచ్ఎండీఏ నిర్వర్తిస్తున్న విధులకు ఇదొక కొలమానంగా నిలుస్తుందని పలువురు ఆర్కిటెక్చర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రోగ్రెస్ రిపోర్టులను ఆన్లైన్లో పరిశీలించుకునే అవకాశం లేకపోవడంతో దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ కార్యాలయానికి చక్కర్లు కొట్టాల్సి వస్తుందని వాపోతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టారు. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న కొత్వాల్‌గూడ ఏకో పార్క్, కోకాపేట నియోపోలిస్ లే అవుట్ అభివృద్ధి పనులతో పాటు, నగరంలోని పలు హెచ్ఎండీఏ పార్కుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ఇటీవల సమీక్షించిన ఆయన.. పనుల్లో అలసత్వం చేయరాదని సూచించారు. కాగా, ట్రాన్సాక్షన్ అడ్వైజరీలతో అధ్యయనం చేస్తున్న ఎలివేటెడ్ కారిడార్, మీరాలం కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.