HMDA | సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): అమీర్‌పేట్‌లోని మైత్రీవనం హెచ్ఎండీఏ కార్యాలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈ కార్యాలయం నిత్యం ఆ చుట్టూ ఉండే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో మునిగిపోతుంది. ఈ ఏడాది వానకాలం ఆరంభంలోనే వరద నీటి ఇబ్బందులు ఎదురవుతుండగా, ఒక్క వారంలోనే రెండుసార్లు ఈ కార్యాలయం నీట మునిగింది.
నాలా పరీవాహక ప్రాంతంలోనే హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం ఉండటంతో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి వరద నీరు పోయేందుకు మార్గం లేకపోవడంతో.. హెచ్ఎండీఏ భవనం సెల్లార్ వరకు నీరు నిలిచిపోతుంది. ఆగస్టు 4న అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో నమోదైన 10సెం.మీ వర్షపాతానికి ఆ భవనం వణికి పోయింది. సెల్లార్లోకి నిమిషాల వ్యవధిలోనే వరద నీరు చేరిపోయింది. దాదాపు 5గంటలు పాటు వరద నీటి ప్రవాహం ఆగలేదు. దీంతో సెల్లార్‌లోని వందలాది కార్లు, బైకులు నీట మునిగాయి.
వరద నీటి నియంత్రణేది..?
హెచ్ఎండీఏ భవనాన్ని ఆనుకుని భారీ నాలా ఉండటంతో వరద ముంపు ఎక్కువగా ఉంది. అయితే వరద నీటి ముంపునకు సంబంధించి ఇప్పటివరకు హెచ్ఎండీఏ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. జీహెచ్ఎంసీ యంత్రాంగంతో కలిసి వరద నీటి ప్రవాహం నియంత్రణకు అవసరమైన చర్యలను ఇప్పటికీ హెచ్ఎండీఏ తీసుకోలేదు. కనీసం కార్యాలయం సెల్లార్లోకి వరద నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఇప్పటికీ ప్రణాళికలు హెచ్ఎండీఏ వద్ద లేవు. నగర శివార్లలోని కాలనీలు, ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే హెచ్ఎండీఏ.. సొంత కార్యాలయంలోని ముంపు నివారణ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.