సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏకు ఇప్పట్లో పూర్వవైభవం వచ్చేలా లేదు. పూర్తిస్థాయి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించినా.. హెచ్ఎండీఏ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. సిటీ జనాల సమస్యలు దేవుడెరుగు… కనీసం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టె ఉన్నతాధికారులే కరువయ్యారు. నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించే హెచ్ఎండీఏ.. ఇప్పుడా బాధ్యతలను పక్కన పెట్టినట్లు ఉంది.
దీంతో సంస్థ పరిధిలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మూలుగుతుండగా, నగరాన్ని వన్నె తెచ్చే ఏ కొత్త ప్రాజెక్టు ఇప్పటివరకు కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు. పూర్తిస్థాయి కమిషనర్ ఉంటేనే హెచ్ఎండీఏ బాగుపడుతుందంటూ గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీయే… అధికారంలోకి వచ్చినా.. తనదైన మార్కును చూపెట్టుకోలేక పోతున్నది. కనీసం అధికారులైనా పనితీరుతో మెప్పిస్తారనుకుంటే… అదీ లేదు. ఫలితంగా ఏడు జిల్లాల్లో పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏలో కార్యకలాపాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఏర్పాటైంది. జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే చుట్టూ 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నగరం అభివృద్ధికి, కొత్త ప్రాజెక్టులకు నోచుకోలేదు. పైగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టారు. ఫలితంగా హెచ్ఎండీఏ భవిష్యత్ ఏమవుతుందా? అని ఆ సంస్థ ఉద్యోగుల్లోనే ఎంతో ఆందోళన నెలకొన్నది.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్ఎండీఏ చైర్మన్‌గా, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నా ఆరు నెలలుగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. గత ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వేల కోట్లతో ప్రాజెక్టులను చేపట్టి, నగరానికి ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. అలాంటి హెచ్ఎండీఏలో పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి.
పలు కాలనీలో ఉన్న హెచ్ఎండీఏ పార్కుల్లో మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం చుట్టారు. రూ. 4.30 కోట్ల అంచనా వ్యయంతో పలు పార్కుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. గడిచిన కొన్ని నెలలుగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పార్కుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, వాకింగ్ ట్రాకులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేకుండా పోయాయి. దీంతో పార్కులకు వచ్చే సందర్శకుల తాకిడి తగ్గుతుండడంతో పాటు అధికారులు నిర్లక్ష్యంపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.
స్పందించిన హెచ్ఎండీఏ యంత్రాంగం పలు పార్కుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. సఫీల్‌గూడ పార్కులో రూ. 24 లక్షలతో స్ట్రీట్ లైట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేయనున్నారు. సరూర్‌నగర్ ప్రియదర్శిని పార్కులో రూ. 34 లక్షలతో వీధి దీపాలు, నారాయణగూడలోని జీఎస్ మేల్కోటి పార్క్‌లో రూ. 47 లక్షలతో ఎల్ఈడీ లైట్లు, కూకట్‌పల్లిలోని పటేల్ కుంట పార్కులో రూ. 31 లక్షలతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. సంజీవయ్య పార్కులో రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా పాత్ వే, టాయిలెట్లు, డస్ట్ బిన్లు, గ్రానైట్ బెంచులు, ప్రహరీ నిర్మాణం వంటి పనులతో ఆధునీకరించనున్నారు.
ఈ ఏడాది జూన్ నెలాఖరున మెట్రోపాలిటన్ కమిషనర్(ఎంసీ)గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి కమిషనర్ రావడంతో పాలన వ్యవహారాలు పరుగులు పెడతాయని, అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ఆశభావం వ్యక్తం చేశారు. కానీ పూర్తిస్థాయి ఎంసీ హోదాలో తన మార్పును ఇప్పటివరకు చూపలేకపోయారనే విమర్శలను మూటగట్టుకున్నారు. ఓఆర్ఆర్ వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటివరకు ఆయన ఒక్క ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టింది లేదు. కనీసం గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏడు జిల్లాల నుంచి సమస్యల పరిష్కారానికి హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చే ప్రజల విషయాన్ని పక్కన పెడితే… కనీసం ఉద్యోగుల సమస్యలను కూడా వినలేదని ఆరోపణలున్నాయి.
ఇటీవల హెచ్ఎండీఏ ఆదాయానికి గండికొడుతూ కొందరు డిప్యూటేషన్ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదులను కూడా ఎంసీ పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, వ్యక్తులతో కుమ్మక్కై పార్కింగ్, డెవలప్మెంట్ వ్యవహారాలతో కోట్ల ఆదాయాన్ని హెచ్ఎండీఏ కోల్పోతున్నదని సమాచారం అందినా.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోలేకపోయారు. ఎలివేటేడ్ కారిడార్లు, పెండింగ్‌లో ఉన్న స్కైవాక్‌లు, చెరువుల హద్దుల నిర్ధారణ వంటి పనులను కూడా ఇప్పటివరకు సమీక్షించలేదు. దీంతో పాలన పడకేయగా, నిర్లక్ష్యపు ప్రభుత్వ పనితీరుకు హెచ్ఎండీఏ నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు చర్చించుకుంటున్నారు.