శేరిలింగంపల్లి, నవంబర్ 15: కత్తితో బెదిరించి ఓ ప్రేమజంట వద్ద దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఈ దోపిడీకి పాల్పడిన స్కూటీపై వచ్చిన సదరు వ్యక్తులు బీదర్ వరకు పలుచోట్ల ఈ తరహాలో కత్తి చూపించి పలువురి వద్ద సెల్ఫోన్లు, ఆభరణాల చోరీలకు పాల్పడినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు.
పహాడీషరీఫ్ షాహిన్నగర్కు చెందిన సయ్యద్ జుబైర్ అలీ అలియాస్ ముజ్జు(20) స్కూటీపై మరో వ్యక్తితో వచ్చి ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో గచ్చిబౌలి స్టేడియం సమీపంలో టీసీఎస్ నుంచి లింగంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సెనగల ప్రశాంత్, జాహ్నవీలను ఆపి కత్తితో బెదిరించి రెండు సెల్ఫోన్లతోపాటు వెండి చెవిరింగులు, బ్రాస్లెట్ మొత్తం రూ.50వేలు విలువజేసే వస్తువులు లాక్కొని పరారయ్యారు. అదేరోజు రాత్రి వరకు గచ్చిబౌలి నుంచి బీదర్ వరకు దాదాపు 10 ప్రాంతాల్లో పలువురిని బెదిరించి దోపీడీలకు పాల్పడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం మసీదుబండాలో వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వ్యవహరించిన నిందితుడు జుబైర్ అలీని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి స్కూటీ, రెండు సెల్ఫోన్లు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీదర్ వరకు పలు ప్రాంతాల్లో ఈ తరహా దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో తెలిందని, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయో, కేసులు నమోదయ్యయో పరిశీలించాల్సి ఉందని ఏసీపీ శ్రీకాంత్ తెలిపారు. నిందితుడు జుబైర్‌పై ఇప్పటికే అబిడ్స్, అత్తాపూర్, కాచిగూడ, అప్జల్‌గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో పాత కేసులు ఉన్నాయని, పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ఉల్లాఖాన్, డీఐ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.