సిటీ బ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రహ్మత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కీలకంగా మారాయి. నియోజకవర్గం మొత్తం మీద 48.79శాతం మాత్రమే ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ మొత్తం మీద అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది మాత్రం ఈ మూడు డివిజన్లలోనే. దీంతో ఈ మూడు డివిజన్లే గెలపోటములను డిసైడ్ చేయనున్నాయి. ఈ మూడు డివిజన్లలో ఎక్కువగా.. పేద, మధ్యతరగతి వాళ్లే ఉన్నారు. ఎప్పటిలాగే నిరక్షరాస్యులు, నిరుపేదలే పోలింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తునది. చదువుకున్న, సంపన్న వర్గాలు ఓటేయడానికి బయటకు రాలేదని స్పష్టమవుతున్నది.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే అత్యధికంగా బోరబండలో 55.92 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 29,760 ఓట్లు పోలయ్యాయి. ఇక నియోజకవర్గంలోనే అత్యంత పెద్ద డివిజన్ రహ్మత్‌నగర్‌లో 40,610 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 55.59 శాతంగా ఉంది. 29,112 ఓట్లతో 49.55 శాతం పోలింగ్‌తో ఎర్రగడ్డ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వెంగళ్రావునగర్ 25,195 ఓట్లతో 47 శాతం, షేక్‌పేట 31,182 ఓట్లతో 43.87 శాతం, యూసుఫ్‌గూడ 24,129 ఓట్లతో 43.47 శాతం, సోమాజిగూడలో 14,553 ఓట్లతో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి.