HMDA | సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో బడా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాసులు కురిపించే హైరైజ్ ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మామూలు భవనాలకే ముప్ప తిప్పలు పెట్టే యంత్రాంగం హెచ్ఎండీఏలో ఉండగా… తాజాగా షాడో నేతల ప్రమేయంతో సామాన్యుడి సొంతింటి కల మరింత కఠినంగా మారింది. అయితే మల్టీ స్టోరైడ్ బిల్డింగులు(ఎంఎస్బీ) విషయంలో ఉన్నతాధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల అనుమతుల కోసం వారం, 15 రోజులకొసారి జరిగే ఎంఎస్బీ సమావేశాలు జరగడం లేదు. దీంతో అనుమతుల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. రోజులు గడుస్తున్నా.. సమావేశాలు నిర్వహించకపోవడంతో దరఖాస్తులన్నీ పేరుకుపోతున్నాయి. దరఖాస్తులను క్లియర్ చేయాల్సిన ఉన్నతాధికారులు మీటింగులను ఏర్పాటు చేయకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి.
ప్రాజెక్టులను తొక్కి పెట్టిన కాంగ్రెస్
ఎన్నికలకు ముందు హెచ్ఎండీఏ పరిధిలో నిర్మిస్తున్న హైరైజ్ ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు విషయంలో మీనవేషాలు వేస్తున్నారు. హైరైజ్ ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతుందంటూ నాడు వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే హైరైజ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ తొక్కి పెట్టేస్తోంది. దీంతో గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండీఏ పరిధిలో ఎంఎస్బీల అనుమతుల ప్రక్రియ అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఓఆర్ఆర్ వెంబడి భారీ ప్రాజెక్టులకు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నా.. అనుమతులు రాకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.
సమావేశాలకు దూరం…
నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో అనుమతుల కోసం వచ్చే ఎంఎస్బీల దరఖాస్తుల క్లియరెన్స్‌కు వారం, 10రోజులకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల నగరంలో నెలకొన్న హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివాదాల నేపథ్యంలో ఎంఎస్బీలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది. సమీపంలో నాలా, చెరువులు ఉంటే 18 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఉంటే అనుమతులు తప్పనిసరి చేయాల్సి ఉండగా, ఎంఎస్బీల సమావేశం లేకపోవడంతో జాప్యం జరుగుతున్నది. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అనుమతులను నిలిపివేస్తే క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.