సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో వీధి కుక్కల నియంత్రణ, కుక్క కాటు నివారణకు జీహెచ్ఎంసీలో హై లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీల కార్పొరేటర్లతో పాటు కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కుక్కల నియంత్రణ, కుక్క కాటు ఇబ్బందులు లేకుండా చేయడం, ఏబీసీ మానిటరింగ్ కమిటీ వేయాలని తీర్మానించారు. ఈ మేరకు కుక్కల నియంత్రణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హై లెవెల్ కమిటీలో ఒక్కొ పార్టీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లను నియమించారు. ఈ కమిటీకి కో-ఆర్డినేట్ ఆఫీసర్‌గా డా.జేడీ విల్సన్ (డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ) వ్యవహరించనున్నారు. ఈ హై లెవెల్ కమిటీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తుందని కమిషనర్ తెలిపారు.