హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. పలు వివాదాస్పద భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటించుకుంటున్న హైడ్రా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేయడమేంటంటూ హైడ్రాను ప్రశ్నించింది. ఓఆర్ఆర్ పరిధిలో పలుచోట్ల హైడ్రా చేపట్టిన చర్యలను హైకోర్టు తప్పుపట్టింది. ఐలాపూర్లో కూల్చివేతల నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకున్నామంటూ హైడ్రా ప్రతీసారి ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఈ భూములకు సంబంధించి కొన్నిచోట్ల అక్రమ నిర్మాణాలు, కట్టడాలు ఉంటే వాటిని నేలమట్టం చేయడం, అక్కడున్న వారిని కట్టుబట్టలతో బయటకు పంపుతున్న హైడ్రా చర్యలకు ఈ తీర్పుతో కళ్లెం పడేనా.. అంటూ నగరవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందస్తు నోటీసులు లేకుండా హఠాత్తుగా సెలవురోజుల్లో వచ్చి కూల్చివేతలు చేపట్టడంపై గతంలోనే హైడ్రాను కోర్టు మందలించినప్పటికీ అదే పంథా కొనసాగిస్తుండడంపై కూడా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)
కూల్చివేతలు ఆగేనా..!
హైడ్రా కోర్టు కేసులున్నా చాలాచోట్ల వివాదాలున్న భూముల విషయంలో జోక్యం చేసుకుని కోర్టు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కూల్చివేయడంపై హైకోర్టు తప్పుపట్టింది. ఐలాపూర్లో కూల్చివేతల విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా నేలమట్టం చేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. ప్రధానంగా హైడ్రా విధులకు సంబంధించిన గైడ్లైన్స్ కోర్టు ముందు పెట్టేవరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, రహదారులకు వర్తించవంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నగరంలో హైడ్రా కొనసాగిస్తున్న విధ్వంసకాండ ఆగుతుందా లేదా అనే చర్చ మొదలైంది.
ముఖ్యంగా ఆ భూమి ఎవరిదని ఇంకా కోర్టుల నుంచి తీర్పులు రాకముందే అవి అక్రమ నిర్మాణాలు అంటూ వాటిలో పర్మిషన్లు ఉన్నవాటిని కూడా లెక్కచేయకుండా కూల్చివేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో ఇదే తరహా చర్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడగట్టుకున్న హైడ్రా చర్యలను ప్రభుత్వ పెద్దలు సమర్థించడంపై సోషల్మీడియాలో నెటిజన్లు దుయ్యబట్టారు. హైడ్రాపై వందల కేసులు ఉన్నాయని, తనపై వ్యక్తిగతంగా కేసులున్నాయంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేక మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఐలాపూర్తో పాటు పలుచోట్ల హైడ్రా చేస్తున్న చర్యల్లో ప్రధానంగా ఫెన్సింగ్ వేసి, బోర్డులు పెట్టడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొన్ని స్థానిక వివాదాల్లోనూ హైడ్రా తలదూర్చి కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉందో అంత పెద్ద పెద్ద నిర్మాణాలు కూల్చివేయడం ద్వారా చాలా నష్టం జరుగుతున్నదన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. హైడ్రా అంటే భరోసా అని కమిషనర్ చెబుతుంటే భరోసా ఎక్కడిదంటున్న బాధితులు హైడ్రా అంటేనే భయం కలిగే పరిస్థితి తలెత్తిందంటూ మండిపడుతున్నారు.
విధివిధానాలపై స్పష్టతేది?
ఇప్పటివరకు హైడ్రా విధివిధానాలపై స్పష్టత లేదని ఏ ఒక్కకేసులో హైడ్రా గైడ్లైన్స్, ప్రామాణిక విధానం ఏమిటో కోర్టుకు సమర్పించలేదంటూ వ్యాఖ్యానించింది. హైడ్రా ప్రతివాదిగా అనేక కేసులున్నాయని, కనీసం వంద కేసులున్నాయన్నారు. ఏ ఒక కేసులో కూడా హైడ్రా కూల్చివేతలకు అనుసరించే విధివిధానాలు ఏమిటో, అమలు చేసే ప్రామాణిక విధానం ఏమిటో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. అందుకే విధివిధానాలపై వివరణ ఇచ్చే వరకు హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరిగి ఆదేశాలను జారీ చేసే వరకు యధాతధా స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. అసలు హైడ్రా విషయంలో ఒక పద్ధతంటూ లేదని చాలా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకచోట ఒకలా.. మరోచోట మరోలా వ్యవహరిస్తున్న హైడ్రా పెద్దలను వదిలి పేదోళ్లనే టార్గెట్గా చేసుకుంటున్నదన్న విమర్శలు ఉన్నాయి. కోర్టు వివాదాల్లో ఉన్న భూములలో కొన్ని చోట్ల కేసులున్నాయని వదిలేస్తే, మరికొన్నిచోట్ల తీర్పులను పట్టించుకోకుండానే కూల్చివేతలు చేపట్టింది. భూముల విషయంలో ఎలాంటి స్పష్టమైన తీర్పు రాకున్నా వాటిని స్వాధీనం చేసుకుని కోట్లరూపాయల విలువైన భూములు స్వాధీనంచేసుకున్నామంటూ ఫెన్సింగ్ పెట్టి బోర్డులు పెట్టడం.. మరికొన్నిచోట్ల పెద్దలకు సంబంధించిన భూముల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏవో సాకులు చూపిస్తున్నదంటూ పలువురు విమర్శిస్తున్నారు. హైడ్రా ఐలాపూర్లో చేపట్టిన కూల్చివేతలతో పాటు పలు చోట్ల తెల్లవారుజామునే పేదలను ఇళ్లలోంచి బయటకు పంపి కూలగొట్టిన దృశ్యాలపై తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుంది. ఇప్పటికీ హైడ్రాకు ఏ విధానం ఉందనే స్పష్టత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.