హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పారు చుట్టూ కూడళ్ల అభివృద్ధిలో భాగంగా మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ సమీపంలోని కూడళ్ల అభివృద్ధికి 2015లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్త కె. పురుషోత్తంరెడ్డి మరికొందరు 2016లో పిల్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి. ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేబీఆర్ పారులు వన్యప్రాణులు, అరుదైన పక్షిజాతి ఉందని, ఈ నిర్మాణాల నిమిత్తం 3 వేలకుపైగా చెట్లను నరికివేయాల్సి వస్తుందన్నారు. అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేశామని తెలిపారు. ప్రతివాదుల్లో కేంద్రం ఇంకా కౌంటరు దాఖలు చేయాల్సి ఉందన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం 6 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.