హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వాటిలో సమస్యలు ఉంటే చట్టప్రకారం నోటీసు జారీ చేసి చర్యలు తీసుకోవాలంది. ఈ ఉత్తర్వుల అమలుకు అనుమతులు ఉన్న కేబుల్ ఏజన్సీలు అనధికారిక కేబుళ్లను తొలగింపునకు విద్యు శాఖ అధికారులు/సిబ్బందికి సహకరించాలని ఆదేశించింది అక్రమ కేబుళ్లను తొలగించడానికి, ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకునే చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్, పిటిషనర్లను ఆదేశించింది. విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
రామంతాపూర్‌లో విద్యుదాఘాతంతో ఆరుగురు మరణించిన తర్వాత రాష్ట్ర సరార్ ఆదేశాలతో కేబుళ్లను ఏకపక్షంగా తొలగింపు చర్యలను భారతి ఎయిర్ టెల్ హైకోర్టులో సవాలు చేసింది. దీనిని జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. రవి వాదిస్తూ, అన్ని అనుమతులు తీసుకున్నాకే కరెంటు స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నట్లు చెప్పారు. నోటీసు కూడా ఇవ్వకుండా హైదరాబాద్ సిటీ అంతటా కేబుళ్లను కట్ చేశారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరపున ఎన్ శ్రీధర్‌రెడ్డి స్పందిస్తూ, దాదాపు 20 లక్షలకు పైగా కరెంటు స్తంబాలు ఉన్నాయని 1.73 లక్షల స్తంభాలకు మాత్రమే అనుమతులు తీసుకుని కేబుళ్లను ఏర్పాటు చేశారన్నారు. విచ్చలవిడిగా కేబుళ్లు ఉన్నాయని చెప్పారు. విపరీతంగా కేబుళ్లు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ కేబుళ్ల బరువుకు ఒరిగిపోతుంటే కింది సిబ్బంది జేబులు అక్రమ సొమ్ముతో నింపుకుంటున్నారా..అని ఘాటు వ్యాఖ్య చేసింది. అక్రమ కేబుళ్లు ఉన్నాయని గుర్తించినపుడు వాటిపై మీరెందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీసింది. చట్టాలు నిద్రాణ పరిస్థితులో ఉన్నాయని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై కఠినంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎవరి వల్ల ఆరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు మరణించారో ఆయా శాఖలు ఆత్మపరిశీలన చేసుకోవాలంది. ఆ కుటుంబాల మనోవేదనను ఎలా ఉందో కూడా ఆలోచన చేయాలంది. ఈ నిర్లక్ష్యానికి అందరూ సమష్టి బాధ్యత వహించాలని చెప్పింది. అనుమతి లేని కేబుళ్లను తొలగించడమే కాకుండా అనుమతి ఉండి అవి జనానికి తగిలే వేలా డూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కేబుళ్ల తొలగింపుపై తీసుకునే చర్యల ప్రతిపాదనలు సమర్పించాలని ఇరపక్షాలను ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.