హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1996లో జారీ అయిన జీవో 570 మేరకు వార్డుల పునర్విభజన చేయలేదంటూ హైదరాబాదీ సయ్యద్ సలీం మరొకరు వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
పిటిషనర్ న్యాయవాది బరాత్ అలీఖాన్ వాదిస్తూ జీవో 570 ప్రకారం వార్డుల విభజన జరిగే దాకా ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువరించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర మున్సిపల్ చట్టాల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన ఉందన్నారు. అయితే, జీహెచ్ఎంసీలో వార్డుల విభజన కాలేదన్నారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లోని సెక్షన్ 6 రాజ్యాంగంలోని అధికరణ 243 ఎస్, డీలిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 8 (బీ)లకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం సెక్షన్ 6లో జనాభాకు బదులుగా ఓటర్లు అని ఉండటం చెల్లదన్నారు. కౌంటర్లు దాఖలు చేసేందుకు 3 వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది.