మణికొండ, జనవరి 6: కోకాపేటలో విలువైన సర్కారు భూమికి నకిలీ పట్టాలతో అధికారులు, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నది. వరుసగా ‘నమస్తే’ లో వస్తున్న కథనాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరా తీయగా, క్షేత్రస్థాయి అధికారుల బృందం మంగళవారం కోకాపేటలోని సర్వేనంబర్ 147లో పర్యటించినట్లు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలను గండిపేట రెవెన్యూ అధికారులతో సమీక్షించి తదుపరి చర్యలను తీసుకుంటామని వారు తెలిపారు.
ఇదిలా ఉండగా, నార్సింగి పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తుల గురించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ నకిలీ పట్టాల వ్యవహారంపై కోకాపేట గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రదారులెవరు..? ఇంత బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నా పట్టింపు లేకుండా ఉండటానికి కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారాన్ని హైడ్రా అధికారులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.