సిటీబ్యూరో: హైదరాబాద్‌లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా వాహనాలకు అసహజ రంగులెందుకని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తారా? ఇలాంటి హంగులతో మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా? అంటూ హైడ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఖాజాగూడలో తమ్మిడిగుంట ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో తమ్మిడిగుంట చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా పట్టా భూముల్లో జోక్యం చేసుకుంటున్నారని వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారించిన హైకోర్టు ఇరుపక్షాలు యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా చర్యలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వర్రావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.
అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలుపై ఉదాసీనంగా ఉంటున్నారని, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తే వాటినీ తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, సరైన సమయం కోసం చూస్తున్నామని, అప్పుడు కోర్టుకు ఉన్న అధికారం ఏంటో చూపిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు.
చెరువుల పునరుద్ధరణ పనులను అడ్డుకోవడం లేదని, ఎఫ్టీఎల్కు సంబంధించి ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి సూచించారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు ఓ పద్ధతి లేకుండా ఎన్నేళ్లు ఇలా వివాదాలతో కొనసాగిస్తారని, ఎఫ్టీఎల్లో ప్రైవేటు పట్టా భూమి ఉంటే భూసేకరణ చట్టం ద్వారా సేకరించడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. తమ్మిడిగుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి దాఖలైన పిటిషన్‌తో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.