నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 15 (నమస్తే తెలంగాణ) : పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు … అయితే.. పోలీసులు తమను చితకబాదారని నిందితులు కోర్టుకు తెలపడంతో ఎస్సైపై మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పోలీసులు చితకబాదారని అరచేతులను, కాళ్లను మెజిస్ట్రేట్‌కు చూపించారు.
ఇద్దరు నిందితులు కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎందుకు కొట్టారని ఎస్సై పవన్‌పై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. ఉస్మానియా సూపరింటెండెంట్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టుకు రిపోర్టు సమర్పించాలని, రిపోర్టు అందిన వెంట నే పోలీసులపై చర్యలు తప్పవని 8వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్చరించారు. హత్య జరిగింది కదా? విచారణ పేరుతో కొట్టేంత అవసరమేముంటుందని ఎస్సైని ప్రశ్నించారు. విచారణ పేరుతో నిందితులను కొట్టాల్సినంత సమయం మీకెక్కడిదీ? పనిలేదా? ఇన్స్పెక్టర్కు ఫోన్‌చేసి ఎందుకు కొట్టారో అడగమని ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి సమాచారాన్ని అడిగిన పిదప కొట్టలేదని అధికారి తెలిపారని కోర్టుకు ఎస్సై వివరించారు. ఒకవేళ నిందితులు అబద్ధాలు చెప్పినట్టు తేలితే వారిపై మరో క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని నిందితుల తరఫు న్యాయవాదులకు మెజిస్ట్రేట్ సూచించారు. ఏప్రిల్ నెలలో మసియొద్దీన్ అనే రౌడీషీటర్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డబీర్‌పురా ప్రాం తంలోని డీలక్స్ మెడికల్ షాపు సమీపంలో రౌడీషీటర్ హత్యకు గురికావడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఉన్న జునైద్ (ఏ9), మహ్మద్ ఇస్మాయిల్ బియాబాని అలియాస్ ఫ్రూట్ మహ్మద్ (ఏ12), రుక్నుద్దీన్ (ఏ13), ఫైజల్ ఖాన్ (ఏ14)లను మూడు నెలల తర్వాత అరెస్టు చేసి కోర్టు ఎదుట మంగళవారం హాజరుపర్చారు. తుంటి ఎముక ఆపరేషన్ వల్ల వీల్ చేర్లో ఉన్న ఏ9కు తగు అత్యవసర వైద్య సహా యం అందించాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏ9ను మాత్రమే 14రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఒక్కరిని మాత్రమే చంచల్‌గూడ జైలుకు తరలించా రు.
మిగతా ముగ్గురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో అధికారులు ఆగ్రహావేశాలకు లోనై నేరం చేసినట్టు ఒప్పుకోవాలని హింసించినట్టు నిందితుడు- ఏ9 మెజిస్ట్రేట్‌కు వివరించారు. నిందితులపై పోలీసుల తీరుపట్ల అడ్డుకట్ట వేయాలని న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరడంతో నిజానిజాలు కోర్టుకు తెలియజేయాలని, పోలీసు స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించాలని తెలిపారు.