వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల విస్తృత పర్యటన.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ విస్తృత చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలో 168 అత్యవసర బృందాలు వర్ష సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040- 21111111కు రోజూ వందలాది ఫిర్యాదులు వస్తున్నా వెంటనే పరిష్కారం చూపుతున్నారు. శిథిల భవనాలు, నాలాల వెంట అధికారుల బృందం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. నీటిని వేడి చేసుకుని తాగాలని సూచిస్తున్నారు.
వరద ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. నష్ట నివారణకు నాలాల పొడవునా వరద ప్రభావం ఉండి, తలెత్తే సమస్యలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జోన్ల వారీగా ప్రత్యేక బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎల్బీనగర్ జోన్ పరిధిలో 74 ప్రభావిత ప్రాంతాలకుగానూ 76 మంది పర్యవేక్షణ చేస్తున్నారు. చార్మినార్ జోన్‌లోని 52 ప్రాంతాలకు 32 మంది అధికారులు, ఖైరతాబాద్‌లో 71 కాలనీలకు 81 మంది, శేరిలింగంపల్లిలో 52 ప్రాంతాలకు 52 మంది, కూకట్‌పల్లిలో 48 ప్రాంతాలలో 49 మంది అధికారులు, సికింద్రాబాద్ జోన్లో 55 పాయింట్లలో 79 మంది ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఉంటూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్
అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా తెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమ దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తుండడంతో రాగల రెండు రోజులు నగరంలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న ఆరంజ్ అలర్ట్ హెచ్చరికలను ఎల్లో అలర్ట్‌కు మారుస్తూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్దగా వాన ప్రభావం కనిపించలేదు. రాత్రి 9గంటల వరకు గాజులరామారంలో అత్యధికంగా 8.3మిల్లీ మీటర్లు, శేరిలింగంపల్లిలో 8.3మిల్లీ మీటర్లు, జీడిమెట్లలో 6.8మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లాలో 3సెం.మీ. వర్షపాతం నమోదు
మేడ్చల్, జూలై13(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వారం రోజులుగా పడుతున్న వానలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉంటున్నారు. మున్సిపల్ కమిషనర్లు వరదనీటి సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసరమైతేనే బయటకు రండి..
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మనిషి జీవితం చాలా విలువైనదని..దయచేసి జాగ్రత్తగా ఉండాలంటూ వర్షాకాలం దృష్ట్యా జీహెచ్ఎంసీ పౌరులకు జాగ్రత్తలు సూచించింది. మ్యాన్‌హోళ్ల మూతలు తెరవొద్దని, నాలాల్లోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని , ప్రవాహంలో కొట్టుకుపోతారని ప్రజలకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. ఈ సందేశాన్ని మూడు భాషల్లో ఆస్తి పన్ను రికార్డుల్లోని యాజమానుల ఫోన్ నంబర్లకు స్వల్ప సందేశం రూపంలో పంపించామని ఈఎస్సీ జియావుద్దీన్ తెలిపారు. వార్తా పత్రికలు, టీవీలు, రేడియోలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేపడుతున్నట్లు ఈఎస్సీ స్పష్టం చేశారు.
జంట జలాశయాలకు తగ్గిన వరద
ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 482
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో గరిష్ట స్థాయి నీటి నిల్వలు చేరడంతో 4 రోజులుగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేసి మూసీలోకి నీటిని వదులుతున్నారు. బుధవారం హిమాయత్‌సాగర్ రెండు గేట్లను 0.6 అడుగుల మేర ఎత్తి దిగువకు 170 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ జలాశయాల్లోకి ఎగువ నుంచి 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇక ఉస్మాన్‌సాగర్‌లోకి 300 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఒక గేటు అడుగు మేర, మరో గేటు రెండు అడుగుల మేర ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. కాగా హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని, ఇదే పరిస్థితి కొనసాగితే గురువారం ఉదయం 8 గంటలకు గేట్లు మూసివేస్తామని అధికారులు పేర్కొన్నారు.
జూపార్క్‌లోని నీటిని తీసేయండి
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ)/ చార్మినార్: బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్లోకి చేరిన వరదనీటిని వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సమీపంలోని మీరాలం చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి జూ పార్లోకి నీరు భారీగా చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్‌తో ఫోన్లో మాట్లాడి జూ పార్లోని నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే జీహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బందిని జూ పార్కు పంపించి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. జూ పార్ క్యూరేటర్ రాజశేఖర్ తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని మంత్రి తెలుసుకున్నారు.