LRS | మేడ్చల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మార్గ నిర్దేశం చేయడానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు 13 మున్సిపాలిటీలు, ఎంపీడీవో కార్యాలయాలలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ హెల్ప్ డెస్క్‌లను సంప్రందించి నివృత్తి చేసుకునేలా డెస్క్‌లు ఉపయోగపడనున్నాయి. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను చేసుకున్న వారు అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వని పక్షంలో ఇప్పుడు హెల్ప్ డెస్క్‌లలో అందించే వీలును కల్పించారు. అంతేకాక త్వరలోనే ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్ఎఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలకు జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పర్యవేక్షణపై దీశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీ సంఖ్యలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉన్న నేపథ్యంలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలోని జీహెచ్ఎంసీ సర్కిళ్లతో పాటు మున్సిపాలిటీ పరిధి, గ్రామీణ ప్రాంతాలతో కలిపి లక్షా 43 వేల దరఖాస్తులు వచ్చాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 26 వ తేదీ వరకు రిజిష్టర్ అయిన అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, వక్త్, దేవాదాయ భూములు ఉన్నట్లయితే పరిశీలన అనంతరం, తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సరైన ధ్రువ పత్రాలు ఉన్నట్లయితే ఫీజు చెల్లించేలా సంబంధిత దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తారు. దీనికి సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని నియమించారు.