బేగంపేట్, నవంబర్ 18: బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాహనాలు ధ్వంసం,ప్రాణ నష్టం వాటిల్లుతున్నది. అయినా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏ మాత్రం సేఫ్టీ పరికరాలు కానీ , రహదారిని సూచించే సూచికలు కానీ, బారికేడ్లు కానీ ఏర్పాటు చేయడం లేదు. దీంతో మూడు మలుపులుగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపు చలానాలు విధించడం, డ్రంకన్‌డ్రైవ్ పైన మాత్రమే దృష్టి సారించడానికి సమయం కేటాయిస్తున్నారు తప్ప.. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించడం లేదు.
మూడు మలుపుల్లో నిత్యం ప్రమాదాలు..
పంజాగుట్ట వైపు నుంచి వాహనాలు బేగంపేట్వైపు వస్తున్న క్రమంలో బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద ైఫ్లై ఓవర్ దిగి మలుపు తీసుకుంటాయి. దీంతో ఫ్లై ఓవర్ దిగిన వెంటనే బల్కంపేట్ వైపునకు వెళ్లేందుకు మరో మలుపు ఉంటుంది. ఇక్కడ మలుపు తీసుకునే క్రమంలో ఎలాంటి సూచికలు కానీ, బారికేడ్లు కానీ ఏర్పాటు చేయలేదు.. మరో కోణంలో బల్కంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు కట్టమైసమ్మ దేవాలయం వెనక భాగం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మూలమలుపు వద్ద ప్రధాన రహదారికి చేరుతాయి. ఈ క్రమంలో బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న వాహనాలు.. బల్కంపేట నుంచి వచ్చి బేగంపేట్ ప్రధాన రహదారికి చేరే వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి వస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో పాటు ఆలయం ముందు నుంచి వచ్చే వాహనాలు కూడా రోడ్డు ఎక్కే క్రమంలో ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మూడు మలుపులు తీసుకునే క్రమంలో వేర్వేరుగా సూచికబోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మహేంద్ర థార్‌ను ఢీ కొట్టిన కంటైనర్..
మంగళవారం ఉదయం బేగంపేట్ కట్టమైసమ్మ ఆలయం ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న మహేంద్ర థార్ వాహనాన్ని ఫ్లైఓవర్ నుంచి కిందకు దిగి సికింద్రాబాద్‌కు వస్తున్న భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మహేంద్ర థార్‌లో ఉన్న ఇద్దరు పిల్లలు, యజమానికి, కంటైనర్ డ్రైవర్లకు గాయాలయ్యా యి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం ఆటో- బైక్ ఢీ కొనగా ఇరువురు గాయాలపాలయ్యారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఘటన జరిగిన తర్వాత వచ్చి క్రేన్ల సహాయంతో వాహనాలను మాత్రం పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తూ దర్యాప్తు చేస్తున్నామని చెబుతుండడం గమనార్హం.