బంజారాహిల్స్,యూసుఫ్‌గూడ, అక్టోబర్ 17: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ ర్యాలీతో శుక్రవారం నగరవాసులు ఆరుగంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అమీర్‌పేట నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ నుంచి పంజాగుట్ట రోడ్లపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరైన ప్రణాళిక లేకపోవడం, ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా ర్యాలీ మొదలుపెట్టడంతో జనం గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. ఆఫీసులకు వెళ్లేవారు, పనుల మీద బయటకు వెళ్తున్నవారు నవీన్ యాదవ్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌లో గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఉదయం 10 గంటల నుంచే యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో కార్మికనగర్, రహ్మత్‌నగర్, శ్రీరాంనగర్ ప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులు సుమారు రెండు గంటల పాటు ఇబ్బందులకు గురయ్యారు. అమీర్‌పేట నుంచి మాదాపూర్ వైపు వెళ్లేవాహనాలను అనుమతించకపోవడంతో వారంతా ఎస్ఆర్నగర్, వెంగళ్రావునగర్, మధురానగర్ కాలనీల్లోనుంచి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఆయా కాలనీలన్నీ హారన్ల మోతతో మార్మోగాయి. వారంతా యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్కు ప్రాంతాల్లోకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
బోరబండ, ఎర్రగడ్డ వైపునుంచి కృష్ణానగర్ మీదుగా జూబ్లీహిల్స్ వైపునకు వెళ్లే వాహనాలన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందుగా ర్యాలీని కృష్ణానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం 5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షేక్‌పేట మండల కార్యాలయానికి రావాలని నవీన్ యాదవ్ భావించారు. చెక్‌పోస్ట్ వైపు వెళ్తే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయని గుర్తించిన పోలీసులు ఆ రూట్లో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనికి బదులుగా కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెం 3కు చేరుకోవాలని అర్ధరాత్రి తర్వాత అనుమతి ఇచ్చారు. దీంతో ఆయా రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
రోడ్లన్నీ దిగ్బంధం.. అడుగడుగునా పోలీసు పహారా.. చుట్టుపక్కల ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు.. ఎమర్జెన్సీని తలపించేలా వాహనదారులను రోడ్లపై కట్టడి.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. పోలీసుల అత్యుత్సాహం.. ఇది శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్‌కు ర్యాలీ సందర్భంగా జూబ్లీహిల్స్‌లో నెలకొన్న దుస్థితి. ఆరు గంటల పాటు వాహనదారులు నరకం చూశారు. వందలాది మందిని రోడ్లపైకి చేర్చి కత్తులు కటార్లతో విన్యాసాలు చేస్తూ జనజీవనానికి తీవ్ర అంతరాయం కల్గించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంది మార్బలంతో పదుల సంఖ్యలో పహిల్వాన్లు, రౌడీ షీటర్లను ర్యాలీలో భాగం చేశారని, నామినేషన్ వేసేందుకే సాధారణ ప్రజలను ఇంత ఇబ్బంది పెడితే.. ఒకవేళ ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిత్యం నరకం చూడాల్సిందేనని ప్రజలు చర్చించుకుంటున్నారు.