మారేడ్పల్లి, సెప్టెంబర్ 24: మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ గోడ కూలడంతో, దానికి ఆనుకొని ఉన్న ఆరు టైలర్ దుకాణాలు, ఒక పూల దుకాణం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయం అయ్యింది. వివరాల్లోకి వెళ్లితే.., మోండా మార్కెట్ వెనకాల ఉన్న మున్సిపల్ పురాతన భవనం మడిగెల్లో.. చాలా సంవత్సరాల నుంచి అద్దెలను చెల్లిస్తూ పలువురు టైలర్ షాపులను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ గోడలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. దీంతో ఓల్ జైల్ ఖానా ప్రహరీ గోడ మంగళవారం సాయంత్రం కూలడంతో ఆ కిందనే కొనసాగుతున్న దుకాణాలపై మట్టి దిబ్బలు, రాళ్లు పడటంతో అందులో పని చేస్తున్న పలువురు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కృష్ణ అనే టైలర్ మాత్రం కొంత ఆలస్యంగా రావడంతో తన కాలుకు స్వల్ప గాయం అయ్యింది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న కుట్టు మిషన్లతో పాటు పలు సామగ్రి, దుస్తువులు ధ్వంసమైనట్లు షాపుల యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, మార్కెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికంగా చుట్టు పక్కల ఉన్న దుకాణాలను ఖాళీ చేయించారు. జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సహాయంతో పురాతన భవనాన్ని పూర్తిగా నేల మట్టం చేశారు. మట్టి గోడలతో నిర్మించిన పురాతన భవనాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.