అసలే వర్షాకాలం…చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఎఫ్టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) కంటే తక్కువ నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి. కుండపోత వర్షాలు కురిసిన చెరువు అలుగులు మత్తడి పోయకుండా చర్యలు చేపట్టాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ చెరువుల్లోని నీటి మట్టాలను కనీసం తనిఖీలు చేయడం లేదు. చాలా వరకు చెరువులు నిండుకుండలా మారాయి.
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యంగా సరూర్నగర్ పెద్ద చెరువు, కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు, లింగంపల్లిలోని గోపీ చెరువు, ఫాక్స్ సాగర్, నల్లగండ్ల ఇతరత్రా చెరువుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్న ఫలంగా భారీ వర్షాలు కురిస్తే చెరువులు పొంగిపొర్లి పక్కనున్న కాలనీలు, బస్తీలు నీటి మునిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెరువుల్లో నీటి మట్టం తనిఖీ చేస్తూ తూములు, అలుగుల ద్వారా నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం…మరో వైపు లేక్ విభాగంలో గడిచిన పది నెలలుగా ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉండడం చెరువుల పరిరక్షణ, వరద నీటి నివారణపై అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది. భారీ వర్షాలు మొదలు కాకముందే అప్రమత్తమై చెరువులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
2020 అక్టోబర్లో కుండపోత వర్షాలు నగర జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం చెరువుల కట్టల బలోపేతం, తూములు, అలుగుల మరమ్మత్తు, మురుగునీటి మళ్లింపు పనులను రూ. 217.33 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి దశల వారీగా చేపట్టింది. 20 ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో 8 చోట్ల పనులు పూర్తయ్యాయి.
రెండో దశ పట్టాలెక్కలేదు..దీనికి తోడు ఎస్ఈ లేకపోవడంతో ముంపు ముప్పు నివారణ, వరద నీటిని నిల్వ చేసుకోవాల్సిన చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేశామని ఒక వైపు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేక కబ్జాదారులకు సంబంధిత అధికారులు వంత పాడుతున్నారు. చేతిలో ఉన్న నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపట్టి మినీ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అధికారులు గడిచిన 17 నెలలుగా పనులపై పురోగతి చూపించడం లేదు .