హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. శనివారం ఉదయం నుంచి నగరాన్ని ముంచెత్తుతున్న వాన.. రాత్రి 7:30 గంటల సమయం నుంచి మాత్రం ఓ రేంజ్లో కురుస్తోంది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు బస్తీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై కూడా భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం కురిసిన వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.