సిటీబ్యూరో, మే 16, (నమస్తే తెలంగాణ) :నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు నిల్వగా..అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి అవస్థలు పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని ఉదయ్‌నగర్‌లో నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తాకిడికి నాలా పూర్తిగా ధ్వంసమైంది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ వెంటనే అత్యవసర బృందాలు, డీఆర్ఎఫ్ టీంలరె అక్కడికి తరలించి ప్రాణనష్టం లేకుండా సహాయక చర్యలు చేపట్టింది.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఇంజినీర్ విభాగం అధికారులను అప్రమత్తం చేశారు. మలక్‌పేట ఆర్యూబీ వద్ద, కృష్ణనగర్, ముషీరాబాద్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో వరద తాకిడికి బైకులు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు నీట మునిగాయి. కాలనీల్లో చెట్లు నెలకొరిగాయి. విరిగి పడిన చెట్ల కొమ్మలతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఏదైన సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040-2111 1111, 9000113667లో సంప్రదించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ ఈ సందర్భంగా సూచించారు.
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 82 ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఇందులో 18 చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడటం, నాలా పైకప్పు ధ్వంసం కావడం, 63 ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 65 ఫిర్యాదులకు పరిష్కారం చూపగా, 17 చోట్ల సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

పది రోజుల కిందట కురిసిన వర్షానికి వివిధ కారణాలతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 14 మంది బలయ్యారు. మున్సిపల్, విద్యుత్, పోలీస్ శాఖలు అప్రమత్తంగా లేకపోవడంతోనే తీవ్రత పెరిగింది. ఆ రోజు జరిగిన ఘటనలతో పాఠాలు నేర్చుకోవాల్సిన ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు తిరిగి అదే నిద్రావస్థలో ఉన్నారు.గురువారం కురిసిన వర్షం నగారాన్ని అతలాకుతలం చేసింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది ఉండటం వల్ల వాహనాలు వేగంగా అటు నుంచి వెళ్లేందుకు అవకాశముంటుంది. కానీ అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కనిపించలేదు.

అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. దీంతో సికింద్రాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బషీర్‌బాగ్, మలక్‌పేట, ఆసీఫ్‌నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది ఇండ్లకు బయలుదేరడంతో అప్పటికే ట్రాఫిక్ రద్దీగా ఉండగా, ఆ తరువాత మరింత పెరిగింది. దీంతో ఎక్కడికక్కడే నగరంలో జంక్షన్లు జామ్ అయ్యాయి.
హయత్‌నగర్, సంతోష్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, గుడి మల్కాపూర్, షేక్‌పేట, అసెంబ్లీ, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, శిల్పారామం, గచ్చిబౌలి, మల్కాజిగిరి, మెట్టుగూడ తదితర చెట్లు విరిగిపడ్డాయి. డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని విరిగి పడిన కొమ్మలను, నెలకొరిగిన చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

ఉప్పల్, ఈసీఐఎల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, రాజ్‌భవన్, మెట్టుగూడ, కేబీఆర్ పార్కు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టి సాఫీగా నీరు వెళ్లేలా చేసి..ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించింది.
భారీ వర్షం.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ట్రాఫిక్ పోలీసులకు ముందు చూపు లేకపోవడంతో నగరంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర అవస్థలుపడ్డారు. ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి..? వర్షం తీవ్రంగా ఉండటం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఎక్కడ ఏర్పడుతుంది..? అక్కడ తీసుకోవాల్సిన చర్యలేమిటీ అనే విషయాలపై అటు అధికారులు కాని.. ఇటు సిబ్బంది కాని అప్రమత్తంగా లేకపోవడం వల్లే పరిస్థితులు చేయి దాటుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరముంటుంది.

అలా జరగకపోవడంతో గురువారం నగరంలో కురిసిన భారీ వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాదర్‌ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద వాననీరు నిండిపోయింది. సుమారు అరగంటకుపైగా రెండువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావం కిలోమీటర్లమేర పడటంతో నగరమంతా స్తంభించిపోయింది. దిల్సుఖ్నగర్, చార్మినార్, అబిడ్స్, నాంపల్లి, అంబర్‌పేట, సైదాబాద్ వైపు గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద పోలీసులు నీటిని తొలగించారు.
కొందరు అధికారులు బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అయితే చాదర్‌ఘాట్, మలక్‌పేట, చార్మినార్, కోఠి, అంబర్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా ఏర్పడినా.. అక్కడ అధికారులు ఎవరూ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌లోనే వాహనదారులు నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుల్తాన్‌బజార్‌లో చెట్లు విరిగిపడటంతో పోలీసులు వాటిని తొలగించారు. అయితే చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు సమస్య ఉత్పన్నమైన తరువాత కూడా వేగంగా చర్యలు తీసుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది.