Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులు వీచడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అరగంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో పలు చోట్ల రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇక ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో.. రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంజాగుట్ట, అమీర్‌పేట, కృష్ణానగర్, మధురానగర్, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఎస్సార్ నగర్, మాసబ్‌ట్యాంక్, గచ్చిబౌలి, లక్డీకాపూల్, బేగంపేట్, సోమాజిగూడతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.