సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం భారీ వర్షం కురిసింది. మూడు నాలుగు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న నగరవాసులు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. ఒక్కసారిగా కురిసిన వానతో నగరంలో పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
మరికొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి 9గంటల వరకు సికింద్రాబాద్లోని పాటిగడ్డలో అత్యధికంగా 7.48, బన్సీలాల్పేట్లో 7.30 వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.