సిటీబ్యూరో: నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. బస్సులు సరైన సమయంలో రాకపోవడంతో వానలోనే తడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా యాప్ అగ్రిగేటర్స్ సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. కానీ యాప్ అగ్రిగేటర్స్ సేవలు.. వర్షం కురిసిన మొదటి రెండు గంటలు నిలిచిపోవడంతో రైడ్స్ బుకింగ్ కాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంత ప్రయత్నించినా.. రైడ్ బుక్ కాకపోవడంతో సంబంధిత యాప్ అగ్రిగేటర్స్కు ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు.
కొందరికి బుకింగ్ ఓకే అయ్యాక యాప్లో చూపించిన రైడ్ ధరకు గమ్యస్థానానికి చేరుకున్నాక.. చూపించే రైడ్ ధరలో వ్యత్యాసం ఉంటుందని ఐటీ ఉద్యోగి ప్రసన్న తెలిపారు. ‘మొదటగా నా డెస్టినేషన్ రైడ్ ధర రూ. 120 చూపిస్తే రైడ్ ఓకే చేసుకున్నా. కానీ నేను నా గమ్యస్థానానికి వెళ్లాక.. రైడ్ ధర రూ.190 చూపించింది. ఇదేంటని డ్రైవర్ను అడిగితే తనకేం తెలియదని అని చెప్పారు. యాప్లో చూపించినంత ఇవ్వాల్సిందేనని అన్నారు.’ అని ఆమె చెప్పారు. యాప్ అగ్రిగేటర్స్ సేవలపై ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి ప్రయాణికులు, డ్రైవర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు.