బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా ముసురు వాన కురుస్తున్నది. శని, ఆదివారాల్లో దంచికొట్టిన వాన.. సోమవారం నాటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ముసురు మాత్రం వదలడం లేదు. సోమవారం రాత్రి 9గంటల వరకు నగరంలోని నాగోల్లో అత్యధికంగా 1.33సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం రాగల 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.