Heavy Rain | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల్లో భారీ వర్షం, సాయంత్రం సమయానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. ఇక ప్రయివేటు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రిపరేన్స్ ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం బంజారాహిల్స్, ఖైరతాబాద్, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, దుండిగల్, బాలానగర్, గండిమైసమ్మ, సూరారం, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్, చిలకలగూడ, బోయిన్పల్లి, లింగంపల్లి, హైటెక్‌సిటీ, తిరుమలగిరి, మారేడుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, వృద్ధులు వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.