సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ఆఖరి వానలతో నగరం తడిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉన్న సిటీ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నగరంలోని శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లో ఉరుములతో కురిసిన భారీ వానకు ఒక్కసారిగా తడిసింది. ప్రధానంగా రాత్రి 8 నుంచి 9గంటల సమయంలో సెంట్రల్ హైదరాబాద్‌లో కురిసిన వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నగర వ్యాప్తంగా సగటున 7 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, గచ్చిబౌలి, అత్తాపూర్, షేక్‌పేట, టోలిచౌకి, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం కుమ్మరించింది. ఉరుములతో కూడిన వానలతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
అయితే, అర్ధరాత్రి వరకు నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నదని, నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వరదల్లో మ్యాన్‌హోల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్లు బల్దియా వర్గాలు వెల్లడించాయి.