మొదటి వర్షానికే గ్రేటర్ అతలాకుతలమయ్యింది. పాలకులు, అధికారులు నిద్రావస్థలో ఉండడం అది నగర వాసులకు శాపంగా మారింది. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది, అధికార యంత్రాంగం కన్పించకపోవడంతో ఎక్కడి జంక్షన్లు అక్కడే ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఐటీ కారిడార్‌లో పలు చోట్ల రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో వాహనాలు మునిగిపోయాయి. ఉద్యోగులు తమ ఇండ్లకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. అటు బస్సులు లేక.. ఇటూ మెట్రో వరకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో అర్ధరాత్రి వరకు కూడా చాలా మంది తమ కార్యాలయాల వద్దనే ఉండిపోయారు. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో అర కిలోమీటర్ ముందుకు సాగాలంటే రెండు మూడు గంటల సమయం పట్టింది. ప్రజలు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యారు. ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు ఇలా ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. ఇటీవలే తమ మాన్సూన్ బృందాలతో వర్షాకాలానికి సన్నద్ధమయ్యామంటూ చెప్పిన హైడ్రా ఈ వర్షానికి సిద్ధంగా లేక పోవడంతో వర్షాకాలం మొదట్లోనే విఫలమైనట్లు తెలుస్తోంది. వరద ముప్పును నివారించే బాధ్యతను భుజానికెత్తుకున్న హైడ్రా అప్రమత్తంగా లేకపోవడంతో పలుచోట్ల నగరవాసి ప్రత్యక్ష నరకం చూశారు.
హైదరాబాద్‌లో నీరు నిలిచే ప్రాంతాలు 899 ఉన్నాయని చెప్పిన హైడ్రా, తగిన ఏర్పాట్లు చేయలేదనడానికి ఈ వర్ష ప్రభావమే సాక్ష్యంగా నిలుస్తోంది. 200 బృందాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పినప్పటికీ రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత వచ్చే వర్షాలు, వాటివల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నట్లు వర్షంలో నగరవాసి ఎదుర్కొన్న అనుభవాలే నిదర్శనంగా చెప్పాలి. వరద ముప్పు నుంచి రక్షించడానికే హైడ్రాను తీసుకొచ్చామంటూ రేవంత్‌రెడ్డి గత సంవత్సరం హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవ సమయంలో చెప్పారు.
గత సంవత్సరం కురిసిన వర్షాలకు నగరం ముంపు బారిన పడినా తన అనుభవలేమితో పనులు చేయలేకపోయింది. ఈ సారి కూడా బాధ్యత తీసుకున్న హైడ్రా వర్షాకాలానికి ముందే టెండర్లు పిలిచి, బృందాలను సిద్ధం చేయాల్సింది పోయి సమావేశాలు, సమీక్షలతో కాలయాపన చేశారంటూ నిపుణులు విమర్శిస్తున్నారు. చెట్లు పడిపోవడంతో పాటు పలుచోట్ల నీళ్లు నిలిచి జనజీవనం అస్తవ్యస్తం కాగా హైడ్రా మాత్రం తాము చేసిన పనులను సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే పనిలో పడడం విమర్శలకు దారితీస్తోంది.

రోడ్లపై వర్షపునీరు..
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది, దీంతో రోడ్లపైనే గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎవరు కూడా రోడ్లపైకి రాలేదు. హైటెక్‌సిటీ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహిదీపట్నం, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది. అటు బస్సులు లేక, మెట్రో వరకు వెళ్లలేక రాత్రి పొద్దుపోయే వరకు కూడా కార్యాలయాల వద్దనే మహిళా ఉద్యోగులు వేచి చూడాల్సిన పరిస్తితి నెలకొంది.
మొద్దునిద్రలో అధికారులు..
సాయంత్రం వేళల్లో వర్షం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగానే వ్యవహరించారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం బయటకు రాకుండా నిద్రావస్తలో ఉన్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. సాయంత్రం వేళల్లో అసలే రద్దీ ఉంటుంది, రోడ్లపై నీరు నిలిస్తే సమస్య ఎలా ఉంటుందో కనీసం ముందు చూపు లేకుండా అధికారులు వ్యవహరించారని నగర వాసులు అధికారుల వ్యవహారంపై మండిపడుతున్నారు.
