సిటీబ్యూరో: ఒడిశా కేంద్రంగా నగరానికి భారీగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరానా నేరగాడిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ రెండు కేసుల్లో మొత్తం రూ.60లక్షల విలువైన 119 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వివరాలు వెల్లడించారు.
భూర్గుపాడుకు చెందిన దుగ్యంపూడి శివశంకర్‌రెడ్డి అలియాస్ శివారెడ్డి ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని గంజాయి వ్యాపారులకు హోల్‌సేల్ ధరలో సరఫరా చేస్తున్నాడు. అనేక సార్లు పట్టుబడ్డాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా అమీర్‌పేట, బాలానగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్నాడు.
ఎస్టీఎఫ్ బృందం జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుడికి గంజాయిని అందించేందుకు యత్నిస్తున్న శివారెడ్డిని అరెస్టు చేశారు. అలాగే రాహుల్ , అజయ్ కుమార్, తాడిపల్లి అభిలాష్ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన ఈ విద్యార్థులు విలాసాల కోసం గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. సఎస్టీఎఫ్ పోలీసులు విద్యార్థులు నివాసం ఉంటున్న గదిపై దాడులు జరిపారు. ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు మరో డిగ్రీ విద్యార్థిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.