మేడ్చల్, నవంబరు 30 : పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోసాయిగూడలో జరిగింది. ఈ ఘటనలో రూ.కోట్ల విలువ చేసే పత్తి కాలిబూడిదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం…పూడూరు పంచాయతీ పరిధిలో ఉన్న గోసాయిగూడలో ఉన్న ప్రైవేట్ గోదాంలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించిన పత్తిని నిల్వ ఉంచారు. గతేడాది ఈ గోదాంను సీసీఐ అద్దెకు తీసుకొని, ఆదిలాబాద్ నుంచి పత్తిని ఇక్కడికి తరలించారు.
శనివారం మధ్యాహ్నం గోదాంలో ఉన్న గేట్‌కు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదశాత్తు మిరుగులు ఎగిరొచ్చి పత్తి మీద పడటంతో మంటలు అంటుకున్నాయి. కొద్ది సేపట్లోనే మంటలు వ్యాపించి, ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటల వేడికి గోదాం గోడలు దెబ్బతిని, పై కప్పు కూలింది. ఆ పక్కనే రసాయన గోదాంలు కూడా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక శకటాలను పంపించారు.
ఒకటి, రెండు వాహనాలతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో మల్కాజిగిరి, చర్లపల్లి తదితర ప్రాంతాల నుంచి ఆరు ఫైరింజన్లను రప్పించారు. 40 మంది సిబ్బంది మూడు, నాలుగు గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పక్కన ఉన్న గోదాంలకు మంటలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పత్తి గోదాంలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే అందులో పని చేసే కార్మికులు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దాదాపు రూ.52 కోట్ల నష్టం జరిగినట్టు సమాచారం.