సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘గుండెను పదిలంగా కాపాడుకోవాలి’ అని గుర్తుచేసేలా సైబరాబాద్ అంతటా రెడ్ హార్ట్ ట్రాఫిక్ లైట్లు వెలిశాయి. మరణాల్లో గుండెకు సంబంధించినవే అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ గుండెను కాపాడుకునేందుకు సమయం కేటాయించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ.. ఈ వినూత్న కార్యక్రమానికి స్టార్ హాస్పిటల్ శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సైబరాబాద్‌లోని వంద ట్రాఫిక్ సిగ్నల్స్ల్లో రెడ్ లైట్లకు హార్ట్ ఆకారాన్ని జోడించారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మాత్రమే వాహనదారులు అర నిమిషం ఆగుతారు. ఈ కాస్త సమయంలో మన ఆరోగ్యం ఎలా ఉన్నది? మన ప్రాణాలు నిలిపే మన గుండె ఎలా పనిచేస్తుంది? అన్నది ఆలోచించుకునేలా ఈ రెడ్ హార్ట్‌ను అమర్చారు.
శరీరంలోని అన్ని భాగాలు రోజూ ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. ఒక్క గుండె తప్ప. అమ్మ కడుపులో నాలుగు వారాలకు కొట్టుకోవడం మొదలై.. నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. అది ఒక్క క్షణం లయ తప్పితే జీవితం తలకిందులైపోతుంది. అలాంటి గుండెను ఎంత పదిలంగా చూసుకోవాలి! ఇటీవల వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తున్న మరణాలకు గుండెపోటే ప్రధాన కారణం కావడం ఆందోళన కలిగిస్తున్నది. అందుకే మన గుండె ఆరోగ్యాన్ని గుర్తుచేసేలా స్టార్ హాస్పిటల్ వైద్యులు రెడ్ హార్ట్ ట్రాఫిక్ లైట్‌తో అవగాహన కల్పిస్తున్నారు. ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీటిని ఏర్పాటు చేశారు.