సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): యువ ఉద్యోగుల్లో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనడంలో భాగంగా హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో స్టార్ హెచ్ఆర్ సమ్మేళనం 2025 నిర్వహించారు. 120కు పైగా ప్రముఖ సంస్థల హెచ్ఆర్లు, ఆరోగ్య పర్యవేక్షకులు, కార్యాలయ నిర్వహణాధికారులు హాజరై, ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై చర్చించారు.
నిత్యం ఆరోగ్య తనిఖీలు, మానసిక ఒత్తిడి తగ్గించే కార్యక్రమాలు, ఆరోగ్యవంతమైన ఆహారం, విరామాలు వంటి అంశాలను సంస్థ సంస్కృతిలో భాగం చేయడం అవసరమని పలు సంస్థలు సూచిస్తూ తమ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి వివరించారు. శారీరక చలనం లేకపోవడం, అసమయ భోజనాలు, అధిక ఒత్తిడి వంటి కారణాలతో.. రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, నిద్రలేమి వంటి సమస్యలు యువతను వేధిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.
స్టార్ ఆస్పత్రుల పరిశోధనల ప్రకారం 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న ఉద్యోగుల్లో గుండెపోటు రేటు ఆందోళనకరంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. పౌష్టికాహార లోపం, ఒత్తిడి, నిదానంగా జరిగే వైద్య తనిఖీలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్పారు. గాలి నాణ్యత, కాంతి, కూర్చునే విధానాలు ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కార్యాలయ నిర్వహణ నిపుణులు వివరించారు.
అనారోగ్య ప్రమాద అంచనాలు, హృదయ ఆపాతం సమయంలో తొందరగా స్పందించే విధానాలు, ప్రాథమిక సహాయ శిక్షణ వంటి అంశాలలో మనవ వనరుల విభాగం కీలకపాత్ర పోషించాలి అని నిపుణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీటీ డేటా హెచ్ఆర్ తిరుమలారెడ్డి, స్టార్ ఆస్పత్రుల తాత్కాలిక విభాగం హెచ్ఆర్ డాక్డర్ రాహుల్ కట్టా, ఇన్వెస్కో హెచ్ఆర్ ప్రత్యూష శర్మ తదితరులు పాల్గొన్నారు.