మేడ్చల్, మే 11 (నమస్తే తెలంగాణ): భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులు దరఖాస్తులకు మాత్రమే పరిమితమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర మండలంలో భూ భారతి చట్టం అమలులో భాగంగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈనెల 5న ప్రారంభమైన ఈ సదస్సులు 13 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే జరిగిన రెవెన్యూ సదస్సులలో వందలాది సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. స్వీకరించిన దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు.
గతంలో ధరణిలో దరఖాస్తు చేసుకున్న వాటిని ధరణి ఆన్లైన్ నెంబర్ ద్వారా మరోసారి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అయితే మొదట దరఖాస్తులు వచ్చినవి వచ్చినట్లు పరిష్కరించాలని ఆదేశాలుండగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం దరఖాస్తులను విభజించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంనడం గమనార్హం. అయితే వాస్తవానికి ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా దరఖాస్తులు అందిన వెంటనే పరిశీలన చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయని, అదంతా ప్రచార ఆర్భాటమనే విమర్శలు వస్తున్నాయి.
దరఖాస్తుల పరిష్కారంపై అనుమనాలు..
రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రజల్లో అనుమనాలు నెలకొని ఉన్నాయి. ఈనెల 13న రెవెన్యూ సదస్సులు ముగిసిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందలు లేకుండా ఉన్నవాటిని పరిష్కరించి భూ భారతి చట్టం ద్వారా ఆన్లైన్లో నమోదు చేసే విధంగా చేస్తామని అధికారులు పేర్కొంటుండగా.. దరఖాస్తుదారుల్లో మాత్రం నమ్మకం కలుగడం లేదు. మొదట దరఖాస్తు అందితే తక్షణమే పరిష్కరిస్తామన్న అధికారులు.. ఇప్పుడు గడువు ముగిశాక.. ఎలాంటి ఇబ్బందులు లేని దరఖాస్తులు పరిష్కరిస్తామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రెవెన్యూ సదస్సుల పారదర్శకతపై సందేహాలు నెలకొన్నాయి.