జవహర్‌నగర్, జూన్ 28 : డంపింగ్‌యార్డ్ చుట్టు పక్కల నివసించే 18 లక్షల మంది ప్రజల ప్రాణాలంటే రాంకీ యాజమాన్యానికి లెక్కలేదా అంటూ డంపింగ్‌యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ కమిటీ నాయకులు ప్రశ్నించారు. దుర్వాసతో ప్రజలు సైనస్, చర్మ సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా.. ప్రజల క్షేమం ప్రభుత్వానికి పట్టాదా, రాంకీ ఆగడాలు నశించాలి అంటూ.. డంపింగ్‌యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం డంపింగ్‌యార్డ్ సమీపంలో చెత్త లారీలను నిలిపివేసి నిరసన తెలిపారు.
డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, రాంకీ యాజమాన్యం నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుతుండటం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఎన్జీటీ కోర్టులో విచారణ జరుగుతున్నదని, ఆగస్టు 6న తీర్పు వెలువడనున్నదని, డంపింగ్‌యార్డ్ ప్రాంతంలోని బాధితులు శాంతియుతంగా నిరసన తెలిపి.. కోర్టు దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కు చెత్తను తగ్గిస్తామంటూ.. పెంచుతున్నారని, డంపింగ్‌యార్డ్ ప్రాంతమంతా ప్రమాదకరంగా మారిందన్నారు. డంపింగ్‌యార్డ్‌ను మరో మూడు చోట్ల పెడుతున్నామని రాంకీ చెప్పడమే తప్పితే.. ఇంత వరకు చేసిందేమీలేదని, జవహర్‌నగర్‌కు వచ్చే చెత్తను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, భారీ పొడవునా చెత్త లారీలు నిలిచిపోగా, పోలీసులు జేఏసీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరసనలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సమిరెడ్డి, శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.