సిటీబ్యూరో, ఫిబ్రవరి25(నమస్తే తెలంగాణ): భానుడు క్రమక్రమంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండలు దంచికొట్టే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
గత ఏడాదితో పోలిస్తే ఈసారి హైదరాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఎండతీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించగా, వైద్య, పోలీస్, కార్మిక, సంక్షేమ, మహిళా సంక్షేమం, ఆర్టీసీ మొదలైన శాఖల జిల్లా అధికారులంతా సభ్యులుగా ఉన్నారు. వారంతా ఎప్పటికప్పుడు తమ శాఖల పరిధిలోని ప్రజలకు జాగ్రత్తలు చెబుతుంటారు.
జిల్లాలోని ప్రభుత్వ వైద్యులందరికి ‘ఎండతీవ్రత నుంచి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి? వారిని వడ దెబ్బ నుంచి ఎలా కాపాడాలనే’ అంశంపై ఈనెల 27వ తేదీన శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ తీసుకున్నవారంతా, వాళ్ల పరిధిలో ఉన్న ఆశలు, ఏఎన్ఎంలకు ఇతర సిబ్బందికి శిక్షణనిచ్చి అప్రమత్తం చేస్తారు.
ఎండ ప్రభావం వల్ల మన శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు రోజుకు 5 లీటర్ల వరకు నీరు తాగాలి. మజ్జిగ తీసుకోవడం మంచిది. శీతల పానియాలు, నూనె వంటలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వేడిగాలులు లోపలికి రాకుండా మధ్యాహ్న సమయాల్లో కిటికీలు, తలుపులు మూసేయాలి. సాయంత్రం వేళల్లో లోపలి గాలంతా బయటికి వెళ్లేందుకు తెరవాలి. కాటన్ దుస్తులను ధరించడం వల్ల చెమట కాయలకు దూరంగా ఉంటారు.
అందుబాటులో ఓఆర్ఎస్లు జిల్లాలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో నిత్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. ఆశవర్కర్లు సైతం తమ పరిధిలో ఎండ తీవ్రత ఉన్న ఏరియాలను గుర్తించి వారికి మందులు అందిస్తారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని పీహెచ్సీలో వైద్యులను సంప్రదించండి.
ఎండ తీవ్రతతో చిన్నపిల్లలు, 65 ఏండ్ల వయసు పైపడిన వాళ్లు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్లు అధికంగా ఇబ్బందులకు గురవుతుంటారు. అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంటి పట్టునే ఉండటం ఉత్తమం. అదేవిధంగా రోజువారీ కూలీలు, అడ్డమీది కార్మికులు ఎండలో పనిచేయడం ఇబ్బందికరం. ఆ తరహా ఉన్నవాళ్లంతా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పక నీడ పట్టున ఉండటం సురక్షితం. భవన నిర్మాణ కార్మికులు సైతం నీడ పట్టున ఉంటూ పనులు చేయడం ఉత్తమం. యజమానులు వారి పట్ల దయతో వ్యవహరించి ఎండలో పనిచేయకుండా చూడాలి.