ఉబ్బస వ్యాధిగ్రస్థులకు చేపమందు ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ ఇక లేరు. బోలక్‌పూర్‌లోని పద్మశాలీకాలనీలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
కవాడిగూడ/ అబిడ్స్, ఆగస్టు 24: బత్తిని హరినాథ్ గౌడ్ 1944 సంవత్సరంలో దూద్‌బౌలిలో జన్మించారు. గత 40 ఏండ్ల కిందట భోలక్‌పూర్‌లోని పద్మశాలీ కాలనీకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుమిత్ర దేవి, ఇద్దరు కుమారులు అనిల్‌గౌడ్, అమర్నాథ్ గౌడ్, ఇద్దరు కూతుళ్లు అల్కానంద, అర్చన ఉన్నారు. ముత్తాతల కాలం నుంచి ప్రతి కార్తీక మాసంలో ఉబ్బస వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. హరినాథ్ గౌడ్ చిన్ననాటి నుంచే తన నానమ్మ వద్ద చేప ప్రసాదం తయారీని నేర్చుకొని తన అన్నదమ్ములతో కలిసి చేపమందు పంపిణీ చేస్తున్నారు.
అయితే హరినాథ్ గౌడ్ గత కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి షుగర్ లెవెల్ పెరగడంతో ఇంట్లోనే మృతిచెందాడు. బత్తిని హరినాథ్ భౌతికకాయం వద్ద గౌడ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు రజినీకాంత్ గౌడ్ నివాళులర్పించారు.
బత్తిని హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 10 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్ తెలిపారు. తమ సోదరుడు అనిల్ గౌడ్ ఆస్ట్రేలియా నుంచి, అక్క అల్కానంద అమెరికా నుంచి రావాల్సి ఉందని తెలిపారు. వారు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వస్తారని అనంతరం హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ సంస్థానాధీశుడు నాలుగో నిజాం నాసిరుద్దౌలా కాలంలో పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ నిర్వహించేవారు. ఒక రోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. అందుకు సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికల గురించి ఆయనకు చెప్పాడు. ఈ వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతడి కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్ గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా గత 176 ఏండ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతూనే ఉంది. నగర నలుమూలల నుండే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్రజలు ఇక్కడికి విచ్చేసి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే మధ్యలో కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. చేప మందు కోసం వచ్చే వారికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది.
బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గురువారం రాత్రి బోలక్పూర్ పద్మశాలీ కాలనీలోని ఆయన స్వగృహంలో హరినాథ్ గౌడ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. బత్తిని హరినాథ్ అందించే వైద్యానికి కావాల్సిన ఔషధ మొక్కల పెంపకానికి రాజేంద్రనగర్‌లో గతంలో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని హరినాథ్ కుటుంబానికి దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వీరితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, వై.శ్రీనివాస్ రావు, శంకర్ గౌడ్, సాయి, గౌడ సంఘం నాయకులు అంబాల నారాయణ గౌడ్, మక్బూల్ పాల్గొన్నారు.