కాచిగూడ, ఏప్రిల్ 19: రైలులో దొంగలు చేతివాటం చూపించారు. అకోలా స్పెషల్ రైలులో ఏకంగా హెడ్ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌నే కొట్టేశారు.
కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని బల్కంపేట ప్రాంతానికి చెందిన గణేశ్ దత్తా దుబే (51) ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తిరుపతి-అకోలా ప్రత్యేక రైలులో హైదరాబాద్ కాచిగూడకు బయలుదేరాడు. ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌కు వచ్చాక తన సామన్లు సర్దుకుంటున్న క్రమంలో ఛార్జింగ్ పెట్టిన ఖరీదైన సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో తన మొబైల్‌ను దొంగలించారని గ్రహించిన దుబే.. కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.