బంజారాహిల్స్, మే 6 : ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వచ్చిన మణికొండకు చెందిన వెంకటేశ్ రోడ్డుపక్కన తన బైక్‌ను పార్క్ చేశాడు. లోనికి వెళ్లి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. స్థానికులను ఆరా తీయగా.. రాంగ్ పార్కింగ్‌లో పెట్టినందున బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తీసుకువెళ్లారని చెప్పారు. వెంటనే ఆటోలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిమానా చెల్లించి బైక్ తీసుకుని బయలుదేరాడు. కొంతదూరం వచ్చాక తనవద్ద ఉండాల్సిన పాస్‌పోర్టు ఆటోలో మర్చిపోయినట్లు గుర్తుకువచ్చింది. మరో పదిహేను రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సిన వెంకటేశ్ పాస్‌పోర్ట్ పోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
వెంటనే అపోలో దవాఖాన వద్దకు వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు చెన్నయ్యకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ హోంగార్డు చెన్నయ్య ఆటో స్టాండ్‌లో ఉన్న ఇతర ఆటోడ్రైవర్లతో వాకబు చేసి వెంకటేశ్ ప్రయాణించిన ఆటో వివరాలు సేకరించి ఫోన్ చేశాడు. ఆటో డ్రైవర్ అపోలో వద్దకు వచ్చి హోంగార్డుకు పాస్‌పోర్టును అందజేశాడు. ట్రాఫిక్ పోలీసు తన పాస్‌పోర్టును వెతికిపెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పటికే విదేశాలకు వెళ్లేందుకు వీసా సైతం వచ్చిందని వెంకటేశ్ చెప్పాడు. తనకు సహకరించిన ట్రాఫిక్ హోంగార్డు చెన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపాడు.