ఖైరతాబాద్, సెప్టెంబర్ 25 : ‘ఆటో తోలుకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వాడు.. ఓ ఏజెంట్ నమ్మి మోసపోయి దుబాయిలో చిక్కుకున్న నా భర్తను రక్షించి భారత్‌కు రప్పించాలి’ అంటూ బాధితుడి భార్య కన్నీటి పర్యంతమయ్యారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాంనగర్‌కు చెందిన అమీనా సౌఘాత్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
తన భర్త మహ్మద్ గౌస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటంబాన్ని పోషించుకునే వాడని, అయితే తమ కష్టాలు తీరాలంటే దుబాయికి వెళ్లి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న తన భర్తను సమీర్ అనే ఏజెంట్ కలిశాడని, దుబాయిలో యాక్షన్ ఇంటర్నేషనల్ సర్వీస్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం ఉందని, తనకు కొంత ముట్టచెబితే అక్కడికి పంపిస్తానని చెప్పాడన్నారు. అతడి మాటలు నమ్మి రూ.1.20 లక్షలు అప్పగించామన్నారు. కొన్ని నెలల పాటు దుబాయిలో ఉన్నాడని, చేతి ఖర్చు కోసం ఇక్కడి నుంచి డబ్బులు పంపించామన్నారు.
అదే క్రమంలో సమీర్ అతడి వద్ద పనిచేస్తున్న విక్కీ అలియాస్ శుక్లవేద్, డ్రైవర్ అలీ తన భర్త నుంచి పాస్‌పోర్టు, వీసా తదితర పత్రాలను బలవంతంగా లాక్కొని, వాటిపై తప్పుడు పత్రాలు సృష్టించి క్రెడిట్ కార్డు, బ్యాంకులో పర్సనల్ లోన్ల రూపంలో రుణాలు తీసుకొని కనిపించకుండా పోయారన్నారు. దీంతో ధ్రువపత్రాలు లేక, ఎక్కడా ఉద్యోగం దొరకక, మసీదుల వద్ద ఏర్పాటు చేసే అన్నదానంలో ఒక్క పూట భోజనం చేస్తూ కాలం గడుపుతున్నాడని వాపోయారు.
తనకు 14, 9 సంవత్సరాల కుమార్తెలు, 11, 7 ఏండ్ల కొడుకులు ఉన్నారని, కుటుంబం మొత్తం తన భర్త పంపే డబ్బులతోనే గడుస్తుందన్నారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. తన భర్తను మోసం చేసిన సమీర్ మరో 20 మందిని కూడా మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బాధితుడి తల్లి అఫ్జలున్నీసాబేగం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.