ఘట్కేసర్ రూరల్, నవంబర్ 10 : అభివృద్ధి కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని, కాంగ్రెస్‌కు అధికారం యిస్తే ఉన్న పథకాలకు మంగళం పాడి రాష్ర్టాన్ని దోపిడీ చేస్తారని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మర్పల్లిగూడ, ఎదులాబాద్ గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో శుక్రవారం మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో ఊహించని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఎరుకల మద్దతు మల్లారెడ్డికే..
ఎదులాబాద్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై ఆయనకు మద్దతు తెలుతున్నట్లు ఏకలవ్య సంఘం సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా 250 మందికి పైగా ఎరుకల కులస్తులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో ఉన్న ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ భద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, సర్పంచ్‌లు మంగమ్మ సాయిలు, సురేశ్, నాయకులు లక్ష్మయ్య, మంకయ్య, ప్రజలు పాల్గొన్నారు. కాగా ప్రచారంలో భాగంగా ఘట్కేసర్లో ముస్లిం సోదరులను కలిసి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.