దుండిగల్, జూన్ 18: వ్యాపారం పేరుతో రూ.30 లక్షలు కొల్లగొట్టి, ఏడేళ్లుగా తనను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లాకు చెందిన ఎం. మురళీధర్ రెడ్డి (43), లలిత దంపతుల కుటుంబం కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్, సూరారం, కృషి కాలనీలో స్థిరపడింది. వీరికి ముగ్గురు సంతానం.
మొదట్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసే మురళీధర్ రెడ్డికి.. స్నేహితుడు సత్యనారాయణ గౌడ్ (సతీష్) వ్యాపారం చేద్దామని ఏడేళ్ల క్రితం ప్రపోజల్ చేశారు. దీంతో మురళీధర్ రెడ్డి తన వాటాగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. జీడిమెట్ల పారిశ్రామికవాడ, సుభాష్‌నగర్‌లో వినాయక ఇండస్ట్రీస్ పేరుతో పరిశ్రమను ఏర్పాటు చేశారు. నాటినుంచి మురళీధర్ రెడ్డి అందులోనే పనిచేస్తున్నాడు.
అయితే ఏడేండ్లుగా లెక్కలు చూపించకుండా, పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా సత్యనారాయణ గౌడ్.. అకౌంటెంట్ ఫణికుమార్‌తో కలిసి ఇబ్బందుల కు గురిచేస్తున్నాడు. చివరికి పెట్టుబడి డబ్బులు ఇవ్వనని అతను చెప్పాడు. దీంతో వచ్చే డబ్బులు రాక, ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేక మురళీధర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం ఉదయం ఇంట్లో నుంచి పెంట్‌హౌస్‌కు వెళ్లిన మురళీధర్ రెడ్డి అందులోని ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు అతనిని స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా .. తన భర్తను పెట్టుబడి పేరుతో మోసగించి, ఆత్మహత్యకు కారకులైన సత్యనారాయణగౌడ్, ఫణికుమార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
కాగా ఆత్మహత్యకు పాల్పడిన మురళీధర్ రెడ్డి జేబులో లభించిన సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. పరిశ్రమ ఏర్పాటు, బిజినెస్ పార్టనర్ షిప్ పేరుతో ఏడేళ్ల క్రితం తనతో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టించి.. సత్యనారాయణ గౌడ్ , అకౌంటెంట్ ఫణి కుమార్‌తో కలిసి తనకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది లేఖలో వివరించాడు. అదే సమయంలో తాను ఎవరిని మోసం చేయలేదని వాపోయాడు. కొందరికి ఇవ్వాల్సిన డబ్బులు సైతం ఎలా చెల్లించాలి అని ఉత్తరంలో రాశాడు.
తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు క్షమించాలని వేడుకున్నాడు. తనను మోసగించిన వారినుంచి డబ్బులు ఇప్పించాలని కోరాడు. పిల్లల్ని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని తన భార్య లలితకు విజ్ఞప్తి చేశాడు. ఇదే తన మరణ వాంగ్మూ లం అని చివరగా రాసి సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలిసివేసింది. ఒక మంచి వ్యక్తి జీవితంతో ఆడుకొని ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.