ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 : ఆన్లైన్లో బెట్టింగ్లతో (Online betting)పాటు పేకాటకు అలవాటు పడి అప్పులు చేసిన ఓయువకుడు దొంగతనాలకు(Thefts) పాల్పడుతూ..మాడ్గుల పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కేవీపీ రాజు మీడియా సమావేవంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7న మాడ్గుల పోలీసుస్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి శివారు ఇర్వేన్ వద్ద ఎర్రమట్టికోసం వెళ్లిన వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించుకుపోయాడన్నారు.
శుక్రవారం మాడ్గుల సమీపంలో ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆపకుండా వెల్లిన కోళ్లవ్యాన్ను వెంబడించి పట్టుకుని విచారించగా వృద్ధురాలి మెడలోనుంచి పుస్తెల తాడు అపహరించిన విషయాన్ని నిందితుడు వెల్లడించారన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలానికి చెందిన నిందితుడు సత్తయ్య గతంలో ఆన్లైన్లో బెట్టింగ్లకు బానిసయ్యాడని, గత రెండు సంవత్సరాలుగా జూదం ఆడి రూ.20లక్షలు బాకీ పడ్డాడని పేర్కొన్నారు. బాకీలు తీర్చటం కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడని వివరించారు. యువకులు ఆన్లైన్ బెట్టింగ్లు, పేకాటకు బానిసలై తమ జీవితాలను వ్యర్థం చేసుకోవద్దని సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.