iPhone Stolen | ఖైరతాబాద్: అర్జంట్ కాల్ చేసుకుని ఇస్తానంటూ ఐఫోన్ తీసుకుని పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ మండలం చంద్రగిరి నగర్ నివాసి సునీతా రాయ్(39) అనే మహిళకు ఏడాది క్రితం ఇక్రమ్ ఖాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన వారివద్ద ఉద్యోగం ఉందంటూ చెప్పడంతో ఈనెల 12న బంజారాహిల్స్‌లోని హ్యాబిటేట్ కేఫ్ వద్దకు వచ్చింది.
సునీతతో మాట్లాడుతున్న క్రమంలో ఇక్రమ్ఖాన్ తాను అర్జెంట్ కాల్ చేసుకోవాలంటూ ఆమె వద్దనుంచి ఐఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. ఇక్రమ్ఖాన్ నడుచుకుంటూ ముందుకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటిరోజంతా అతడి ఫోన్ కోసం వేచి చూసినా లాభం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సునీత శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 318(4), 303(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.