సిటీ బ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులే దొరకడం లేదట. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన వారు దేశంలోనే లేరట. అవును.. హెచ్‌సీయూ ఉన్నతాధికారులే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుకు ఒక్కరు కూడా సరైన వారు లేరని తేల్చారు. గడిచిన మూడేండ్లలో రెండు సార్లు సీవోఈ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశం నలుమూలల నుంచీ అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కరికి కూడా ఆ పోస్టుకు అర్హత లేదని తేల్చి చెప్పారు. ‘నన్ ఫర్ సూటబుల్’ అని ప్రకటించేశారు. యూనివర్సిటీలో ముఖ్యమైన రెండు విభాగాలైన పరీక్షలు, ప్రవేశాల నిర్వహణకు అర్హులు దొరకడంలేదని బోధనేతర విభాగానికి చెందిన వ్యక్తిని ఇన్చార్జి కంట్రోటర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా నియమించారు. మూడేండ్ల నుంచి ఆయన కంటే అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు హెచ్‌సీయూ ఉన్నతాధికారులకు దొరకడం లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఇన్చార్జి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి కలిసి ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమ సొంత ప్రయోజనాలనే పరమావధిగా హెచ్‌సీయూ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
బోధనేతర అధికారిని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పలుమార్లు ఉద్యమించడంతో రిజిస్ట్రార్ దిగివచ్చారు. పూర్తిస్థాయి అధికారిని నియమించేందుకు నామమాత్రంగా రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించారు. మొదటిసారి 15 మంది అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. స్క్రూటినీ పూర్తి చేసి వారిలో ఒక్కరు కూడా అర్హులు లేరని తేల్చారు. దీంతో వారు గ్రీవెన్స్‌ను ఆశ్రయించగా ‘నన్ ఫర్ సూటబుల్’గా ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత మరొక నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించగా ఈసారి 13 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మరోసారి స్క్రూటినీలో వారందరినీ తిరస్కరించారు. మరోసారి నన్ ఫర్ సూటబుల్‌గా ప్రకటిస్తే అనుమానం వస్తుందని నియామక ప్రక్రియనే నిలిపేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 28 మందిలో ఒక్కరు కూడా సీఈవోగా పనికి రారా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బోధనకు సంబంధించిన వ్యక్తులను పూర్తిస్థాయి ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్‌గా నియమిస్తే ఇన్నాళ్లుగా తాము(వర్సిటీ పెద్దలు) చేసిన తప్పిదాలు బయటపడతాయనే ఎవరినీ ఎంపిక చేయడంలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రస్తుతమున్న ఇన్చార్జి పదవీ కాలం 2026 వరకు ఉన్నట్లు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన పదవీ విరమణ తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్థానాన్ని ఖాళీగా ఉంచుతారా? అని ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి అధికారి నియామకాన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వీసీని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూనివర్సిటీలో వీసీ నిర్ణయాలతో సంబంధం లేకుండా రిజిస్ట్రార్ అధిపత్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో జరిగే ప్రతి వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌లోనూ ఆయనదే పైచేయిగా ఉండేలా చేస్తున్నారని అంటున్నారు. ప్రొఫెసర్లు, ఇతర బోధన సిబ్బంది ఆయన చెపుచేతల్లోనే ఉండాలని తీరుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే తనకు అనుకూలమైన బోధనేతర అధికారిని సీవోఈగా నియమించారని ఆరోపిస్తున్నారు. మూడేండ్ల కిందట సీవోఈగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలో యూనివర్సిటీ ర్యాంకింగ్ గణనీయంగా పడిపోవడంతో పాటు అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రోజుల తరబడి అడ్మిన్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టారు. పూర్తిస్థాయి ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను నియమించాలని ఉద్యమించారు. దిగివచ్చిన రిజిస్ట్రార్ చేసేదేమీ లేకపోవడంతో తనకు అనుగుణంగా ఉండే బోధనేతర ఉద్యోగిని ఇన్చార్జిగా నియమించారు. దీంతో యూనివర్సిటీ భవితవ్యాన్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జి సీవోఈ నియామకంపై విద్యార్థులు మూడేండ్ల నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏటా అడ్మిషన్ల తోపాటు యూనివర్సిటీ ర్యాంకింగ్ పడిపోతూనే ఉన్నాయి. యూనివర్సిటీ ర్యాకింగ్ పడిపోవడం, అడ్మిషన్లు తగ్గడానికి ప్రొఫెసర్లు సరిగ్గా పాఠాలు బోధించకపోవడంమేనని వారిపైకి నెట్టేస్తున్నారని మండిపడుతున్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగస్థులకు బోధన గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. తాము తీసుకునే అడ్డగోలు నిర్ణయాలను పక్కన పెట్టి ప్రొఫెసర్లపై నెపం నెట్టేయడమేంటని నిలదీస్తున్నారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి యూనివర్సిటీ భవిష్యత్తును దృషిలో పెట్టుకుని రెగ్యులర్ సీవోఈని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.