నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బార్ అసోసియేషన్లకు ఎన్నికైన కమిటీల గడువును రెండేళ్లకు పొడగించాలనే సందిగ్దతకు తెరపడింది. ఒక సంవత్సరం మాత్రమే కమిటీ గడువుంటుందని బార్ కౌన్సిల్ ప్రకటించింది. ప్రతి ఏడాది మార్చి 31లోపు తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని బార్ కౌన్సిల్ కార్యదర్శి వి.నాగలక్ష్మి శనివారం ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణలోని అన్ని కోర్టులకు చెందిన బార్ అసోసియేషన్ల కమిటీ గడువును రెండేళ్లకు పెంచాలని బార్ కౌన్సిల్‌కు వచ్చిన వినతి పత్రాల్ని సమీక్షించింది. అదేవిధంగా హైకోర్టులో సైతం రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించింది.
అనంతరం కౌన్సిల్ నిర్ణయం మేరకు ప్రతి ఏడాది మార్చి 31లోపు ఎన్నికలు పూర్తి చేయాలని అన్ని బార్ అసోసియేషన్లకు ఉత్తర్వులు జారీ చేసింది. బైలాస్ నం.9 ప్రకారం రెండు సంవత్సరాల వరకు కమిటీ గడువు విధించడం చట్ట వ్యతిరేకమవుతుందని, బార్ కౌన్సిల్ మోడల్ బైలాస్ రూల్ 21 (2) ప్రకారం కమిటీ గడువు ఒక్క సంవత్సరమేనని తేల్చి చెప్పింది.