హయత్ నగర్, జూన్ 11: అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.035 కిలోల 10 గంజాయి ప్యాకెట్లు, రూ.40 వేలు విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గుండు శేఖర్(40), హయత్ నగర్‌లోని శుభోదయ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుంట్లూర్ రోడ్డులో దుర్గాభవానీ ట్రేడర్స్‌ను నిర్వహిస్తున్నాడు. శేఖర్‌కు బిహార్‌కు చెందిన రిషి శంకర్ మిశ్రా అలియాస్ గుడ్డు (39) నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్నాడు.
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్సైలు కట్టా వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సిబ్బందితో వెళ్లి దుర్గాభవానీ ట్రేడర్స్ షాపుపై దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి సెవెన్ మినార్ వట్టి అని లేబుల్ కలిగిన 9 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు, చార్మినార్ గోల్డ్ మునక్క అనే లేబుల్ కలిగిన 10 ప్యాకెట్లలో 2.035 కిలోల గంజాయి, రూ.40వేల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితులుపై బీఎన్ఎస్ సెక్షన్ 20(i), COTPA & 20 (b) (ii) (A) NDPS చట్టం-1985 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హయత్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు గంజాయి ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని లేదా డయల్ 100కి కాల్ చేయాలని సీఐ నాగరాజ్ గౌడ్ సూచించారు.